Elections: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్
ABN , Publish Date - May 10 , 2026 | 12:44 AM
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
తిరుపతి సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పీవోసీలు, ముఖ్యనాయకులతో శనివారం తిరుపతిలో సమావేశం నిర్వహించారు.స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ కమిటీ సభ్యులైన బాలినేని శ్రీనివాసులు, ఆరణి శ్రీనివాసులు ఈ సమావేశంలో మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో జరుగుతున్న వార్డులు, డివిజన్ పునర్విభజనపై చర్చించారు. జనసేన బలంగా ఉండే వార్డులు, డివిజన్లు గుర్తించాలని వాటిలో ఎమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటి వివరాలను కమిటీకి అందించాలని బాలినేని కోరారు. పునర్విభజనపై పూర్తి వివరాలను ఆయా ప్రాంత నాయకులు 13వ తేది లోపు కమిటీకి పంపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రకటన వెలువడిన నాడే జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటించేలా అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నివేదిక సమర్పణకు ఇచ్చిన సమయం తక్కువగా ఉందని, పొడిగింపు విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాలపైన మాత్రమే కసరత్తు చేస్తున్నామని త్వరలో నియోజకవర్గాల వారీగా మండలాల్లో పర్యటించి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన ఎక్కడ బలంగా ఉంది, ఎవరు పోటీ చేయాలనే అంశాలతో నివేదిక సిద్ధం చేసి అధిష్ఠానానికి అందిస్తామని బాలినేని చెప్పారు. కొత్త వార్డులు, డివిజన్లలో జనసేన ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించడంతోపాటు సరైన అభ్యర్థులను సూచిస్తే బాగుంటుందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు.పార్టీ కోసం కష్టపడే వారికి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని చెప్పారు.
బలాబలాలపై చర్చ
భోజన విరామం తరువాత ఉమ్మడి కడప జిల్లా పీఓసీలు, ముఖ్యనేతలతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. నియోజకవర్గాలవారీగా జనసేన బలంగా ఉన్న డివిజన్లు, వార్డుల గురించి కమిటీ దృష్టికి తీసుకురాగా రాతపూర్వకంగా ఇవ్వాలని పీఓసీలకు కమిటీ సభ్యులు సూచించారు. అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై సమీక్ష జరిగింది. అహుడా ఛైర్మన్ వరుణ్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, కడప జిల్లా కో-ఆర్డినేటర్ సుంకర శ్రీనివా్‌స,అన్నమయ్య జిల్లా నాయకుడు రాందాస్ చౌదరి, ముక్కంటి ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి,తిరుపతి నాయకుడు రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.