El Nino: ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:40 AM
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో పరిస్థితులను ఆరా తీశారు.
కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సీఎం ఆదేశం
తిరుపతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో పరిస్థితులను ఆరా తీశారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. అదే సమయంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. విశాఖ సదస్సులో కుదిరిన పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాలకు సంబంధించి జిల్లాకు అధికంగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. దానికనుగుణంగా భూసేకరణ చేపట్టడంతోనే ఎలాంటి ప్రయోజనం చేకూరదని, సేకరించిన భూములను వెంటనే పరిశ్రమలకు అప్పగించాలని చెప్పారు. అప్పుడే రాష్ట్ర జీడీపీ పెరుగుతుందన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలని, సుదీర్ఘకాలంగా పెండింగులోని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. 22ఏ, ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అది జరిగినప్పుడే ప్రభుత్వానికి ఆదాయం రావడంతోపాటు రైతులకు, యజమానులకు భూములపై హక్కులు వస్తాయని, అభివృద్ధి కార్యకలాపాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. కాగా, సదస్సులో ప్రభుత్వం విడుదల చేసిన అభివృద్ధి పనుల నివేదిక ద్వారా పలు అంశాల్లో జిల్లా సాధించిన ప్రగతి ఇలా ఉంది.
వ్యవసాయ జీవీఏ పెరిగినా తగ్గిన ర్యాంకు
గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏ పెరిగినప్పటికీ ర్యాంకు మాత్రం తగ్గడం గమనార్హం. 2025-26 మొదటి త్రైమాసికంలో జీవీఏ రూ.2040 కోట్లు ఉండగా జిల్లా 13వ ర్యాంకు సాధించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జిల్లా జీవీఏ రూ.2,240 కోట్లుగా నమోదైంది. అంటే గతేడాదితో పోలిస్తే రూ. 200 కోట్లు ఎక్కువ. అయితే ర్యాంకింగ్‌లో మాత్రం జిల్లా 13వ స్థానం నుంచి 14వ స్థానానికి దిగజారింది.
పీఎంఏవై ఇళ్ల నిర్మాణంలో జిల్లాకు 8వ స్థానం
పీఎంఏవైౖ 1.0, 2.0 కార్యక్రమాల కింద చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణంలో జిల్లా 8వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఈ కార్యక్రమాల కింద మొత్తం 83,406 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా అందులో 82,929 నిర్మాణం మొదలు పెట్టారు. వాటిలో 64,781 పూర్తవగా, 18,148 ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 477 ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టలేదు. పనులు ప్రారంభించిన ఇళ్లలో 78 శాతం పూర్తి కావడంతో జిల్లా ఏపీలో 8వ స్థానంలో నిలిచింది.
ఇంటింటికీ కొళాయిల్లో 12వ స్థానం
జిల్లాలోని ఆరు మున్సిపల్ స్థానిక సంస్థల్లో ఇంటింటికీ కొళాయి కనెక్షన్లు ఇవ్వడంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది. తిరుపతి కార్పొరేషన్ సహా వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలలో 1,54,236 ఇళ్లకు తాగునీటి కొళాయి కనెక్షన్లు లేవు. వీటిలో ఇప్పటి వరకూ 98,948 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం ద్వారా లక్ష్యంలో 64.15 శాతం సాధించారు. మిగిలిన 55,288 ఇళ్లకు ఇంకా తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
చెత్త సేకరణలో 7వ స్థానం
జిల్లాలోని తిరుపతి కార్పొరేషన్, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పుత్తూరు మున్సిపాలిటీలలో ఇంటింటి నుంచి చెత్త సేకరించే కార్యక్రమంలో జిల్లా 7వ స్థానం సాధించింది. ఈ నగర, పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 1,81,614 ఇళ్లు ఉండగా ఇప్పటి వరకూ అందులో 1,79,001 ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోంది. అంటే లక్ష్యంలో 99.03 శాతం అమలు జరుగుతోంది. తద్వారా జిల్లా ఏపీలో 7వ స్థానంలో నిలిచింది.
అర్బన్ టాయిలెట్స్‌లో టాప్
జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండే విషయంలో జిల్లా ముందు వరుసలో నిలిచింది. మొత్తం 1,81,614 ఇళ్లకుగాను 1,81,416 ఇళ్లలో మరుగుదొడ్ల సదుపాయం ఉంది. కేవలం 198 ఇళ్లకు మాత్రమే ఆ సౌకర్యం లేదని గుర్తించారు. ఈ విషయంలో జిల్లా ఏపీలో టాప్ అనిపించుకుంది.
బాక్స్‌లో పెట్టుకోవాలి
నిబంధనలకు విరుద్ధంగా
44,585 ఎకరాలు ఫ్రీహోల్డ్: కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 44,584.91 ఎకరాల అసైన్‌మెంట్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారని సీఎం దృష్టికి కలెక్టర్ వెంకటేశ్వర్ తెచ్చారు. జిల్లాలో మొత్తం 79,169.45 ఎకరాల అసైన్‌మెంట్ భూములను ఆన్‌లైన్‌లో ఫ్రీ హోల్డ్ చేశారని, అయితే అందులో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసినవి కేవలం 23,477.11 ఎకరాలు మాత్రమేనన్నారు. మిగిలిన 44,584.91 ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో నిబంధనలను సక్రమంగా పాటించలేదని గుర్తించామన్నారు. కాగా ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూముల్లో 1696.36 ఎకరాలు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయన్నారు. వాటిని పరిశీలిస్తే 901.61 ఎకరాలను మాత్రమే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారని, మిగిలిన 794.75 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ చేశారని తెలిపారు.