Share News

SVIMS: ‘మందుల’ మాఫియాకు పెద్దల అండ!

ABN , Publish Date - May 06 , 2026 | 12:45 AM

స్విమ్స్‌ ఓపీడీ బ్లాకు వద్ద వున్న 3వ నెంబరు బ్రాండెడ్‌ మందుల షాపులో నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయించి రోగులను దోచేయడంతో పాటు వారి ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది.

SVIMS: ‘మందుల’ మాఫియాకు పెద్దల అండ!
స్విమ్స్‌లోని 3వ నెంబరు బ్రాండెడ్‌ షాపు

రద్దు చేయాలని గతేడాదిలోనే టీటీడీ బోర్డు నిర్ణయించినా కొనసాగుతున్న వైనం

తాజాగా రెండేళ్ల గడువు పొడిగించేందుకు తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలు

తిరుపతి, మే 5 (ఆంధ్రజ్యోతి): పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్‌ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది. స్విమ్స్‌ ఓపీడీ బ్లాకు వద్ద వున్న 3వ నెంబరు బ్రాండెడ్‌ మందుల షాపులో నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయించి రోగులను దోచేయడంతో పాటు వారి ప్రాణాలతోనూ చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొంది.ఈ దుకాణానికి బ్రాండెడ్‌ కేటగిరీ కింద 2024 డిసెంబరులో టెండర్లు పిలిచారు.నాగపూర్‌కు చెందిన ఇన్నోవేటివ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ నెలవారీ అద్దె రూ. 36 అక్షలు చొప్పున టెండరు దాఖలు చేసి షాపు దక్కించుకుంది. గతేడాది ఫిబ్రవరిలో టీటీడీతో అగ్రిమెంటు కుదుర్చుకుని షాపు ప్రారంభించారు. అయితే ఆరంభం నుంచే ఈ షాపు నిర్వహణపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. బ్రాండెడ్‌ కేటగిరీ కింద దక్కించుకున్న షాపులో నాసిరకం మందులను అధిక ధరలతో రోగులకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై గతేడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తనిఖీలు జరపగా అక్రమాలు వాస్తవమని తేలింది. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, అంకాలజీ వంటి కీలక విభాగాల రోగులకు ప్రత్యేకమైన మందులు ఇక్కడ విక్రయించాల్సి వుంది. అయితే నాణ్యత లేని మందులు విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆయా విభాగాల వైద్యులే ఆ షాపులో మందులు కొనుగోలు చేయవద్దంటూ రోగులకు సూచించే పరిస్థితి తలెత్తింది. కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోగ్యం ఇక్కడ కొనుగోలు చేసిన మందులతో మరింత దిగజారి ప్రాణాపాయ స్థితికి చేరుకుందంటూ కుటుంబీకులు న్యాయవాది ద్వారా స్విమ్స్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతను తెలిపింది. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో టీటీడీ, స్విమ్స్‌ అధికారులు తనిఖీలు, ఆడిట్‌లు నిర్వహించి పలు అక్రమాలు జరిగినట్టు తేల్చారు. గతేడాది జూన్‌లో టీటీడీ ఈవో షాపు నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. నవంబరులో స్విమ్స్‌ ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. అయినా షాపు మాత్రం ఇప్పటికీ నిక్షేపంగా నడుస్తూనే వుంది.


షాపు రద్దుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసినా....

గతేడాది అక్టోబరులో ఈ షాపు వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకా్‌షరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై అదే నెల 28వ తేదీన జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చ నడిచింది. చివరికి షాపు కేటాయింపును రద్దు చేయాలని, తిరిగి టెండర్లు పిలవాలని పాలకమండలి తీర్మానం (నంబరు 522) కూడా చేసింది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దీన్ని బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇంతవరకూ టీటీడీ బోర్డు తీర్మానం అమలుకు నోచుకోలేదు.ఈ షాపు నిర్వహణలో జరుగుతున్న అక్రమాల గురించి, తనిఖీలలో నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవడం గురించి గత నెలలో ప్రభుత్వానికి మళ్ళీ ఫిర్యాదులు అందాయి. టీటీడీ విజిలెన్స్‌ విభాగం తనిఖీలు చేసి అక్రమాలు వాస్తవమని నివేదికలు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి ప్రభుత్వానికి, టీటీడీ ఈవోకు లేఖలు రాసినట్టు సమాచారం. దీంతో ఈ సారి ఏకంగా సీఎంవో స్పందించినట్టు తెలిసింది. బోర్డు సభ్యుడు గత నెల 3వ తేదీన ఈవోకు ఫిర్యాదుతో కూడిన లేఖను అందజేయగా అదే రోజు ఈవో రవిచంద్ర గత నెల 6వ తేదీన కీలక అధికారులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలంటూ విద్య, వైద్య విభాగాల జేఈవోను ఆదేశించారు. 6వ తేదీన నిర్వహించిన సమావేశంలో 3వ నెంబరు షాపు నిర్వాహకులపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది స్విమ్స్‌ అధికారులా లేక టీటీడీ ఎస్టేట్స్‌ అధికారా అన్నది టీటీడీ లా అధికారితో మాట్లాడి నిర్ధారించాలంటూ స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నెల దాటుతున్నా ఇంతవరకూ చర్యలూ తీసుకోలేదు. వాస్తవానికి ఆ షాపు గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. చర్యలతో నిమిత్తం లేకుండా గడువు ముగిసినందున షాపును మూసివేయించి కొత్తగా టెండర్లు పిలవాల్సి వుంది. అయితే ఎందుకో అధికారులు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. రద్దు కావాల్సిన షాపు గడువు దాటినా నిక్షేపంగా మూడు నెలలకు మించి నేటికీ నడుస్తూనే వుంది.

గడువు పొడిగింపు వెనకున్నపెద్దలెవరు?

తీవ్రస్థాయి అరోపణలు ఎదుర్కొంటున్న స్విమ్స్‌ 3వ నెంబరు బ్రాండెడ్‌ మందుల దుకాణం నిర్వాహకులపై ఏడాదిగా చర్యలు తీసుకోని స్విమ్స్‌, టీటీడీ అధికారులు ఇపుడు చర్యలకు బదులు ఏకంగా గడువు పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్విమ్స్‌తో పాటు టీటీడీలో కూడా కొందరు అధికారులు షాపు నిర్వాహకులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. షాపు రద్దుకు ఏకంగా తీర్మానమే చేసిన టీటీడీ బోర్డు నేడు జరిగే సమావేశంలో ఈ షాపును మరో రెండేళ్ళ పాటు కొనసాగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది.గడువు పొడిగించాలన్న ప్రయత్నాల వెనుక ఎవరున్నారన్నది చర్చనీయాంశంగా మారుతోంది. కొందరు రాజకీయ నేతలు భారీ డీల్‌ కుదుర్చుకుని షాపు కొనసాగింపునకు స్విమ్స్‌, టీటీడీ అధికారులతో పాటు పాలకవర్గంపై కూడా తీవ్రస్థాయిలో ఒత్తిళ్ళు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - May 06 , 2026 | 12:45 AM