Freehold lands: ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం మళ్లీ రెండు నెలలు వాయిదా
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:33 AM
కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ఏడాదిన్నర అవుతున్నా.. క్లియరెన్సు ఇవ్వని వైనం
22ఏ భూములకు క్లియరెన్సు ఇవ్వాలని మంత్రి అనగాని సూచన
ఇప్పటికే క్లియరెన్సు ఇస్తున్న రెవెన్యూ అధికారులు
మంత్రి సూచనతో ఇకపై సుమోటోగా పరిగణన
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: కొత్త సంవత్సర కానుకగా రాష్ట్రంలో 5 రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగిస్లున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాత్ గురువారం ప్రకటించారు. కానీ, సుమారు ఏడాదిన్నరగా నానుస్తున్న ఫ్రీహోల్డ్ భూముల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి రెండు నెలలు ఇప్పటికే ఆరేడుసార్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పైస్థాయిలో ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
1.05 లక్షల ఎకరాలకు అక్రమ ఫ్రీహోల్డ్
2003 కంటే ముందు నాటి అసైన్డ్ భూములకు వైసీపీ ప్రభుత్వం 2023లో శాశ్వత హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది.ఇలా చిత్తూరు జిల్లాలో 1,59,327 ఎకరాల్ని ఫ్రీహోల్డ్ చేసుకున్నారు.వైసీపీ నాయకులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని భావించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీహోల్డ్ భూములకు రిజిస్ర్టేషన్లు ఆపేశారు. 1,05,409 ఎకరాల్ని నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసుకున్నారని విచారించి తేల్చారు. మిగిలిన 53,917 ఎకరాల్ని సక్రమంగా చేశారని నిర్ధారించారు. అక్రమంగా చేసిన వాటిని పెండింగులో పెట్టేసి, సక్రమంగా చేసినవాటికి క్లియరెన్సు ఇవ్వాలని రైతులు కోరుతున్నా ఏడాదిన్నరగా వాయిదా వేసుకుంటూ వస్తూనే ఉన్నారు.
10 వేల మందికిపైగా ఎదురుచూపులు
ఫ్రీహోల్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకుంటే జిల్లాలో ఏకంగా 53,917 ఎకరాలకు విముక్తి కలుగుతుంది. 10 వేలమందికి మించిన రైతులకు మేలు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రైతుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.ఫ్రీహోల్డ్ దెబ్బకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పడిపోయింది.
ఇప్పటికే చేస్తున్న ప్రక్రియకు హడావిడి ప్రకటన
తాజాగా రెవెన్యూ మంత్రి ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు దాన్ని సుమోటోగా తీసుకోవాలని... ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలుంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని, స్వాతంత్య్ర సమరయోధుల భూముల్ని కూడా 22ఏ నుంచి తొలగించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇలాంటివి సుమారు 300కేసులకు పైగా పరిష్కరించారు.తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో మరో 70 కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయి. తాజాగా మంత్రి తీసుకున్న నిర్ణయంతో ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదంటున్నారు.
ఇప్పటికే చేస్తున్నాం: మోహన్‌కుమార్, డీఆర్వో
22ఏ జాబితా నుంచి భూముల తొలగింపునకు సంబంధించి రైతుల నుంచి వచ్చిన అర్జీలను వచ్చినట్లే పరిశీలించి పరిష్కరిస్తున్నాం. మంత్రి ప్రకటనకు సంబంధించి ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో అందే అవకాశముంది.రైతుల నుంచి అర్జీలు రాకపోయినా, అలాంటి భూముల్ని పరిశీలించి నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలనేది మంత్రి ప్రకటన సారాంశం. ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు.