Share News

Nelapattu: నేలపట్టులో విదేశీ పక్షుల సందడి

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:20 AM

పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా పేరొందిన నేలపట్టులో వన్నె చిన్నెల విహంగాల సందడి నెలకొంది.ఆనవాయితీగా సీజన్‌ విడిదికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ విహంగాలు ఈ యేడాది కూడా నేలపట్టుకు విచ్చేశాయి.

Nelapattu: నేలపట్టులో విదేశీ పక్షుల సందడి
విదేశీ పక్షులు

దొరవారిసత్రం, ఆంధ్రజ్యోతి: పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా పేరొందిన నేలపట్టులో వన్నె చిన్నెల విహంగాల సందడి నెలకొంది.ఆనవాయితీగా సీజన్‌ విడిదికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ విహంగాలు ఈ యేడాది కూడా నేలపట్టుకు విచ్చేశాయి.అక్టోబరు చివరి వారంలో పక్షుల రాక మొదలైంది. ఇప్పటికి 5564 పక్షులు విడిదిలో వున్నాయని సమాచారం.నేలపట్టుకు మొదట వచ్చే ఓపన్‌బిల్డ్‌స్టార్క్స్‌(నత్తగుల్లకొంగలు) 1478దాకా నేలపట్టులో గూళ్ళు కట్టుకుని పొదిగే పనిలో పడ్డాయి. నేలపట్టుకు అంతర్జాతీయంగా పెలికాన్‌ పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చిన గూడబాతు జాతి పక్షులు 1064 విడిదిలో ఉన్నట్లు స్థానిక వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వైట్‌ఐబీ్‌స(తెల్లకంకణాయి) 1386, లిటిల్‌ కార్మోరెంట్స్‌(నీటికాకులు) 1224, స్పూన్‌బిల్స్‌( తెడ్డు మూతి కొంగలు) 68, స్పాట్‌ బిల్‌ డక్స్‌(బాతుజాతి) 6, ఇండియన్‌మోర్‌ హెరాన్స్‌ 8, నైట్‌హెరాన్స్‌ 232, పాండ్‌హెరాన్స్‌ 84 నేలపట్టులో ఇప్పటికే విడిదిలో వున్నాయి. ఆస్ర్టేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బర్మా, పాకిస్తాన్‌, ఖజికిస్థాన్‌ దేశాల నుంచి పక్షులు ఇక్కడకు విచ్చేస్తున్నాయి. ఇటీవల కురిసిన కొద్ది పాటి వర్షాలతో నేలపట్టులోని రెండు మంచి నీటి చెరువులకు నీరు చేరి ఉండడంతో ఈ యేడాది పక్షుల విడిది వేల సంఖ్యలో ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పక్షులు నేలపట్టులోని కడప చెట్లపై కొలువు దీరి, గూళ్ళు కట్టుకుని తమ సంతతి వృద్ధి చేసుకుంటాయి. నేలపట్టుకు ఆకాశ మార్గంలో 10 నాటికల్‌ మైళ్ళ దూరంలోని పులికాట్‌ సరస్సులో విహరించి ఆహార అన్వేషణ చేయడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చినట్లుగా నేలపట్టుకు విచ్చేసి గూళ్ళుల్లో పొదగడం చేస్తాయి. ప్రస్తుతం పక్షులు నేలపట్టులోని మంచి నీటి చెరువుల్లో లభ్యమయ్యే చెట్ల నుంచి పుల్లలు, నీటి అడుగు భాగంలో దొరికే పీచులాంటి గడ్డిని సేకరించుకుంటూ గూళ్ళు ను కట్టుకుంటున్నాయి. తమ జత పక్షితో కలసి గూటిని కట్టుకునే పనిలో నిమగ్నమైన పక్షుల కిలకిల రావాల దృశ్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - Nov 22 , 2026 | 01:20 AM