Share News

Crime: బాలుడే చంపేశాడు!

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:56 AM

రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్‌ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.

Crime: బాలుడే చంపేశాడు!
అరెస్టయిన అమర్‌నాథ్‌, సరస్వతి దంపతులను చూపుతున్న డీఎస్పీ పార్థసారథి, సీఐ మల్లేశ్‌ యాదవ్‌

కుప్పం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్‌ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది. ఈ నేరంలో భాగస్వాములైన హతుల పెద్ద కుమారుడు అమర్‌నాథ్‌, కోడలు సరస్వతిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బాలుడిని తిరుపతిలోని జువైనల్‌ హోమ్‌కు పంపించారు. డీఎస్పీ పార్థసారథి, కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ కథనం మేరకు.. రామకుప్పం వైఎస్సార్‌ సర్కిల్‌లో ఉండే వెంకటేశు, పార్వతమ్మ దంపతులకు అమర్‌నాథ్‌, రామకృష్ణ కుమారులు. ఎవరి సంసారాలు వారు చేసుకుంటున్నారు. వెంకటేశుకు అదే మండలం బందార్లపల్లెలో మరో ఇల్లు ఉంది. బందార్లపల్లెలోని ఇంట్లో వీర రెండో కొడుకు నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజూ ఉదయం బందార్లపల్లెకు వచ్చే వెంకటేశు దంపతులు అక్కడ సొంత బోరు మెకానిక్‌ దుకాణంలో పనిచేసుకునే వారు. మధ్యాహ్నం, రాత్రి రెండో కొడుకు ఇంట్లో భోంచేసి, రాత్రికి రామకుప్పంలోని ఇంటికి వెళ్లేవారు. చిన్నకొడుకుమీదే ఎక్కువ ప్రేమతో వ్యవహరించేవారు. రామకుప్పం శివార్లలోని అద్దె ఇంట్లో ఉండే పెద్దకొడుకు అమర్‌నాథ్‌ దంపతులకు, వారి బిడ్డలకు ఇది నచ్చేది కాదు. తమను కావాలనే దూరం పెడుతున్నట్టు భావించేవారు. ఇదిలా ఉండగా వెంకటేశుకు దాయాదులతో ఆస్తి గొడవలు ఇటీవల పరిష్కారమయ్యాయి. భూమి చేతిలోకి వచ్చింది. తమకు ఆస్తులు పంచివ్వాలని కొడుకులిద్దరూ పట్టుబట్టారు. తాను బతికుండగా పంచేది లేదని, తమ తదనంతరమే ఆస్తిపాస్తులు వారికి దక్కుతాయని ఆయన తెగేసి చెప్పాడు. కొన్ని రోజుల కిందట కొడుకులకు భూమి పంచే విషయమై పెద్దలతో పంచాయితీ జరిగింది. రెండు భాగాలుగా విభజించాల్సిన భూమి మధ్యలో రోడ్డు విషయంలో ఇద్దరు కొడుకులకు ఘర్షణ ఏర్పడింది.


ఈ విషయంలో తండ్రి తమపట్ల అన్యాయంగా ప్రవర్తించాడని అమర్‌నాథ్‌ దంపతులు, వారి బిడ్డలు భావించి కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో వారి సమీప బంధువైన మైనర్‌ బాలుడు ఈనెల 17వ తేదీ రాత్రి రామకుప్పం శివార్లలో కాపు కాచి.. బందార్లపల్లె నుంచి బైకుపై వస్తున్న వెంకటేశు, పార్వతమ్మపై కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి హతమార్చాడు. ఈ హత్యకు ప్రేరేపించిన నేరంలో హతుల పెద్ద కుమారుడు అమర్‌నాథ్‌, అతడి భార్య సరస్వతిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకుని తిరుపతిలోని జువైనల్‌ హోమ్‌కు పంపించారు.

Updated Date - Jul 21 , 2026 | 12:56 AM