Talliki Vandanam: వడివడిగా తల్లికి వందనం
ABN , Publish Date - May 31 , 2026 | 12:49 AM
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చించేందుకు ఓ పక్క గట్టి ప్రయత్నాలను చేస్తూనే మరోపక్క తల్లికి వందనం పథకం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది.
వివిధ కారణాలతో పథకానికి కొందరు దూరం
పాత ఇబ్బందులు పునరావృతం కాకుండా ఈసారి చర్యలు
ఆధార్ అనుసంధానంపై విస్తృత అవగాహన
చిత్తూరు సెంట్రల్, మే 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చించేందుకు ఓ పక్క గట్టి ప్రయత్నాలను చేస్తూనే మరోపక్క తల్లికి వందనం పథకం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. కొత్త అడ్మిషన్ల సందర్భంగా ఉపాధ్యాయులు ఈపథకం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే అధిక మొత్తం ఇవ్వడంతో పాటు ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. మరో 12 రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆధార్ నంబరు నమోదు కీలకం చేసింది.
అవగాహన లేక నష్టం
‘తల్లికి వందనం’ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. గతేడాది అవగాహనా రాహిత్యంతో కొందరు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేకపోయారు. దీంతో కొంతమంది పిల్లలు తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందలేకపోయారు. ఈక్రమంలో ఈ ఏడాది అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈపక్రియను వేగవంతం చేయడంలో ఉపాధ్యాయులను భాగస్వాములు చేసింది. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. కాగా 2026-27 విద్యా సంత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం 2.04,355 మంది విద్యార్థులున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఆధార్ అనుసంధానమిలా..
మై ఆధార్ విభాగానికి వెళ్లి ఆధార్ సర్వీసెస్ కింద చెక్ ఆధార్/బ్యాంకు లింకేజీ స్టేటస్ ఎంపిక చేసుకోవాలి.
12 అంకెల ఆధార్ నంబరుతో పాటు ఓటీపీ నమోదు చేసి క్లిక్ చేస్తే మొబైల్ నంబరకు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక స్ర్కీన్‌పై ఆధార్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయ్యిందో కనిపిస్తుంది.
ఖాతా ఉన్న బ్రాంచిలో సంప్రదించి, ఆధార్ సీడింగ్/ఎన్‌పీసీఐ లింక్డ్ ఫారం పూర్తించి సమర్పించాలి.
ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నంబరు తదితర సమాచారాన్ని నమోదు చేసి నిర్దేశించిన చోట సంతకం చేసి బ్యాంకులో సమర్పించి రసీదు పొందాలి.
ఎన్‌పీసీఐ లింకయ్యాక ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశం వస్తుంది.
జాగ్రత్తగా అడుగులు
తల్లికి వందనం సాయం జమ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అర్హుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. లబ్ధిదారులకు గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఈ సారి ప్రభుత్వం ముందస్తుగా బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించిస్తున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది జిల్లాలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 2,64,679 మంది ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్, ప్రైవేటు తదితర యాజమాన్య పాఠశాలల్లో చదివారు. వీరిలో 2,06,541 మంది విద్యార్థులకు చెందిన 1,30,382 మంది తల్లులు ‘తల్లికి వందనం’ పథకానికి అర్హత సాధించారు. విద్యార్థికి రూ.15 వేల చొప్పున అర్హత సాధించిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.338.83 కోట్లు ప్రభుత్వం జమచేసింది. గతేడాది వివిధ కారణాలతో 54,138 మంది పథకానికి అనర్హులయ్యారు. ఇందులో సాంకేతిక సమస్యలు, ఆధార్ అనుసంధానం చేసుకోసులేనివారు ఎక్కువ మందే ఉన్నారు.