Share News

Srikalahasti: భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం

ABN , Publish Date - May 19 , 2026 | 12:38 AM

భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

 Srikalahasti: భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం
సీఐ నాగరాజుకు బాధ్యతలు అప్పగిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

శ్రీకాళహస్తి, మే 18(ఆంధ్రజ్యోతి): భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. సీఐ నాగరాజుకు కొత్త కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో పట్టణవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు ముక్కంటి ఆలయంలోని నిఘా విభాగాన్ని సమన్వయం చేసుకుని జిల్లా పోలీసు యంత్రాంగం మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు త్వరలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు అదనపు పోలీసులను కేటాయించడంతో పాటు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.మంత్రి సత్యప్రసాద్‌ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతంగా వైసీపీ పరిణమించిందని వివరించారు. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ఆలోచనలతో శ్రీకాళహస్తిలో 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ కోసం శంకుస్థాపన చేశారన్నారు. గత పాలకులు అన్నా క్యాంటీన్లను అటకెక్కించిన తరహాలోనే ప్రభుత్వ అభివృద్ధి కార్యకలాపాలను సైతం నాశనం చేశారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 7సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న పలు ఆర్డీవో కార్యాలయాలను తమ ప్రభుత్వం పూర్తిచేసి ప్రారంభించిందని తెలిపారు. వైసీపీ కబ్జాలు, అక్రమాలతో ఆరాచక పాలన సాగించిందన్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాల వల్ల రోజూ శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతూనే ఉండడం బాధాకరమన్నారు.కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి,వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పనబాక లక్ష్మి, నరసింహయాదవ్‌, హరిప్రసాద్‌, టీడీపీ పటణాధ్యక్షుడు విజయకుమార్‌, తొట్టంబేడు మండలాధ్యక్షుడు మునిరాజ నాయుడు తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు మంత్రి అనిత కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.మృత్యుంజయస్వామి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - May 19 , 2026 | 12:40 AM