Share News

Panchayat: పంచాయతీలకు స్పెషలాఫీసర్లు

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:02 AM

పల్లెల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Panchayat: పంచాయతీలకు  స్పెషలాఫీసర్లు

చిత్తూరు జిల్లాలో 184 మంది స్పెషలాఫీసర్లు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పల్లెల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారంతో 621 పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. నిబంధనల ప్రకారం ఆ లోపే ఎన్నికలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్‌ కమిషనర్‌ నివేదిక, ఇతర సాంకేతిక, న్యాయ కారణాలతో ప్రక్రియ ఆలస్యమైంది. అప్పటి వరకు గ్రామ పంచాయతీలను ప్రత్యేకాధికారులు పాలించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 27 మండలాల్లో 621 పంచాయతీలు ఉండగా వీటన్నింటికి ప్రత్యేకాధికారుల నియామకాలు జరిగాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, హౌసింగ్‌, జలవనరులు శాఖ ఏఈలు, డిప్యూటీ డీఈఈలు, ఎఫ్‌డీవోలు, పశు, ఉద్యానశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

ఖాళీల వెక్కిరింత

గెజిటెడ్‌ అధికారులనే ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్‌లు, ఎంపీడీవోలతో పాటు వీరి హోదాకు సమానమైన లేదా ఆపై స్థాయి అధికారులను నియమించాలని ఉత్తర్వులో పేర్కొంది. జిల్లాలో పునర్విభజనతో చిత్తూరు జిల్లాలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో ప్రత్యేకాధికారులుగా 184 మందిని మాత్రమే నియమించగలిగారు. వీరిలో ఒక్కొక్కరికి ఏడు, ఎనిమిది నుంచి 2, 3 పంచాయతీలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేల సూచనల మేరకు ఆయా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరందరూ సెలవు రోజైనా శుక్రవారం నుంచి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని డీపీవో సుధాకర్‌రావు తెలిపారు. గతంలో ఎన్నికలు జరగని 13 పంచాయతీల్లో ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన ఉంది. ప్రస్తుతం అక్కడ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత కలిగిన కొత్త అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించారు.


తిరుపతి జిల్లాలో 781 పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లు

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలం గురువారంతో ముగసింది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. జిల్లాలో 811 గ్రామపంచాయతీలు ఉండగా ఉండగా, పలు కారణాలతో 29 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. ఈ గ్రామాల్లో ఇప్పటికే స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. మిగిలిన 782 గ్రామ పంచాయతీలకు 271మంది స్పెషల్‌ ఆఫీసర్లను నియమిస్తూ గురువారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో.. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీలతోపాటు పశుసంవర్ధకశాఖ, సీడీపీవో, వ్యవసాయశాఖ, విద్య, ఉద్యాన, వ్యవసాయ, తదితర శాఖలకు చెందిన మండలస్థాయి అధికారులు ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధిదీపాలు, చెత్తనిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ వంటిసేవలకు అంతరాయం కలగకుండా చూడటం స్పెషల్‌ ఆఫీసర్ల బాధ్యత. పంచాయతీ నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపు, అభివృద్ధి పనులకు అనుమతులు అన్ని రకాల ఆర్ధికపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. పంచాయతీలకు ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు లేదా ఆరు నెలలపాటు వీరు ప్రత్యేక అధికారులుగా కలెక్టర్‌ పర్యవేక్షణలో పనిచేస్తారు. కాగా, డీఎల్‌పీవోతోపాటు ఎంపీడీవోలు 31మంది, తహసీల్దార్లు 31 మంది, డీటీలు 9మంది, డిప్యూటీ ఎంపీడీవోలు 28మంది, మండల ఎస్‌జీఎ్‌సడబ్ల్యూ ఆఫీసర్లు 27మంది, ఏవోలు 20మంది, సీడీపీవోలు ముగ్గురు, మండల వ్యవసాయశాఖ అధికారులు 27మంది, పశుసంవర్థకశాఖ అధికారులు ముగ్గురు, ఏఈవోలు 51మంది, ఉద్యానశాఖ అధికారులు 8మంది, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు 32మందిని స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించినట్లు డీపీవో సుశీలాదేవి తెలిపారు.

Updated Date - Apr 03 , 2026 | 02:02 AM