Share News

Farmers: ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - May 19 , 2026 | 12:51 AM

ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో రైతులు పొలాలను దుక్కి చేశారు.

Farmers: ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

చిత్తూరు సెంట్రల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో రైతులు పొలాలను దుక్కి చేశారు. మరోవైపు.. ఈ ఏడాది వాతారణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. జూన్‌ మొదటి వారంలో వాతావరణంలో మార్పులు జరిగి.. నైరుతి రుతుపవణాలు అనుకూలించే పరిస్థితులు ఉంటాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

ఏటా ఏదో ఒక కారణంతో రైతులు పంటల సాగుకు వెనకాడుతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గుతోంది. గతేడాది ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 1,78,262 ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 1,10,670గా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్క కట్టింది. అంటే 67,592 ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. ఐదేళ్ల పంటల సాగు సరాసరి విస్తీర్ణంను లెక్కలు కట్టిన రాష్ట్ర వ్యవసాయ ఈ మేరకు సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలిపింది. గతేడాది జిల్లాలోని 1,18,386 మంది రైతులు సాగు చేసేందుకు సిద్ధం కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,06,500కు పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఖరీ్‌ఫలో 22 రకాల పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది 20కి పడిపోయింది. ఖరీ్‌ఫలో ప్రధాన పంటగా చెప్పుకొనే వేరుశనగ సాగు విస్తీర్ణం పరిస్థితి కూడా భిన్నంగా ఉంది. గతేడాది 88,095 ఎకరాలు కాగా, ఈ ఏడాది 33,338 ఎకరాలు తగ్గి 54,757 ఎకరాలకు చేరింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం పంటలపై చూపితే సాగు విస్తీర్ణం మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా ఖరీ్‌ఫలో వేరుశనగ ప్రధాన పంట కావడంతో ప్రభుత్వం సైతం సబ్సిడీపై రైతులకు విత్తన కాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 25 నుంచి సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

పంటల సాగు విస్తీర్ణం ఇలా..

వేరుశనగ 54,757 ఎకరాలు, వరి 22,670, సజ్జలు 147, జొన్నలు 1640, మొక్కజొన్న 1230, సాములు312, రాగి4447, కొర్రలు 2.5, కందులు 3737, ఉద్దిపప్పు(మినుములు) 170, ఉలవలు 3462, పెసలు 157, ఆవుగడ్డి 737, అనుములు 758, సీసమమ్‌ 12.5, చిరుధాన్యాలు 2.5, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌) 2.5, ఆముదం 2.5, పత్తి 22, చెరకు 16397 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. దీనికోసం 40శాతం సబ్సిడీపై వేరుశనగ, 50 శాతం సబ్సిడీపై పచ్చరొట్ట విత్తనాలు ఇవ్వనున్నారు. ఖరీ్‌ఫలో సాగు చేసేందుకు వీలుగా అవసరమైన 27,225 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు జిల్లాకు రానున్నాయి. 337 క్వింటాళ్ల జీలుగ, 1005 క్వింటాళ్ల జనుము, 22 క్వింటాళ్ల పిల్లిపెసర, 845 క్వింటాళ్ల పచ్చరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. యూరియా 5013 టన్నులు, డీఏపీ 617, ఎంవోపీ 385, ఎన్‌పీకేఎ్‌స 2777, ఎస్‌ఎ్‌సపీ 605 టన్నులు అందుబాటులో ఉంచారు.


25 నుంచి విత్తన కాయల పంపిణీ : - మురళి, జేడీ, జిల్లా వ్యవసాయ శాఖ

సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయలు జిల్లాకు రావడం ఆలస్యం కారణంగా ఈనెల 25 నుంచి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వేరుశనగ విత్తన కాయలు రాగానే జిల్లాలోని 342 రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తాం. దీనికి సంబంధించి రైతులు ఆయా ఆర్‌ఎ్‌సకేల్లో విత్తనాల కోసం నమోదు చేసుకుంటున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులకు ఎలాంటి కొరత లేదు. అవసరమైనవి నిల్వలు రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు పురుగుమందుల దుకాణాలు, మార్క్‌ఫెడ్‌, వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్నాయి.

లోటు వర్షపాతం నమోదు కావొచ్చు

రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జేసీ సూచన

చిత్తూరు కలెక్టరేట్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా పాటించాల్సిన చర్యలకు సంబంధించి వ్యవసాయశాఖ తయారుచేసిన ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పుస్తకాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. తక్కువ వర్షపాతం నమోదు కానుండటంతో పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను రైతులు సమర్థంగా ఎదుర్కొనేలా వారిని సమాయత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్‌కుమార్‌, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, వ్యవసాయశాఖ జేడీ మురళి, డీపీఎం శివశంకర్‌, ఉద్యానశాఖ డీడీ రామాంజనేయులు, పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:51 AM