YCP: అయ్యోపాపం వైసీపీ!
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:59 AM
డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.
సూళ్లూరుపేటలో పాల్గొన్న ఇంటర్,డిగ్రీ విద్యార్థులు
తిరుపతి/చంద్రగిరి/తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.చంద్రగిరిలో భారీ ర్యాలీ నిర్వహించాలనుకుని డబ్బులిచ్చి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను, మహిళలను సమీకరించారు.వలస కూలీలకు రూ. 300 చొప్పున చెల్లించేలా మాట్లాడుకుని ర్యాలీకి రప్పించారు.ఎక్కడా డీఎస్సీ అభ్యర్థులు గానీ, విద్యార్థులు గానీ, నిరుద్యోగ యువత గానీ కనిపించలేదు. మరోవైపు వైసీపీ ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తారనే సాకుతో నేతలు సొంతంగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. వారితో ట్రాఫిక్ నియంత్రించేందుకు యత్నించారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిలో కొందరు పోలీసు యూనిఫాంను పోలిన దుస్తులు ధరించి ఏకంగా వాకీటాకీలతో రోడ్డుపై ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లో ఖాకీ దుస్తులు ధరించిన ప్రైవేటు సిబ్బంది ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆలస్యంగా మేల్కొన్న పోలీసు అధికారులు ఆరా తీసే ప్రయత్నంలో పడ్డారు.సాధారణంగా ప్రైవేటు సెక్యూరిటీ నలుపు రంగు పాంట్, టీషర్ట్ ధరిస్తుంటారు. లేదంటే కొందరు సఫారీ దుస్తులు ధరిస్తారు. చంద్రగిరిలో వైసీపీ ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీలో కొందరు అచ్చు పోలీసు యూనిఫాంను పోలిన ఖాకీ దుస్తులను ధరించారు. అలాగే చేతిలో వాకీ టాకీలు కూడా చేతబట్టారు. నేమ్ ప్లేట్, పోలీసు లోగో తప్ప మిగతా వేషధారణ పోలీసులను తలపించేలా వుండడం చర్చనీయాంశం కావడంతో ఎస్పీ సుబ్బరాయుడు సీరియస్ అయ్యారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతికి చెందిన చక్రి సెక్యూరిటీస్ సంస్థ వైసీపీ ర్యాలీకి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్నారు.ముగ్గురు సిబ్బంది ఖాకీ దుస్తులు ధరించినట్లు గుర్తించారు. కొర్లగుంటకు చెందిన చక్రవర్తి ఈ సంస్థను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థతో పాటు ముగ్గురు సిబ్బందిపై చీటింగ్ బై ఇంపర్సనేషన్ కింద చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.చక్రి సెక్యూరిటీ్‌సకు తిరుపతిలో కార్యాలయం కూడా లేదని సమాచారం. ఈ క్రమంలో సదరు సెక్యూరిటీ సంస్థ చట్టబద్దమైందేనా అనే అనుమానాలు రావడంతో పోలీసులు ఆ సంస్థ వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు.సూళ్ళూరుపేటలో వైసీపీ నేతలు ర్యాలీకి ప్రతిభ కళాశాల నుంచీ ఇంటర్,డిగ్రీ విద్యార్థులను రప్పించారు. ర్యాలీలో విద్యార్థులు వైసీపీ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడం చూసి పట్టణవాసులు విస్తుపోయారు. రైల్వే కోడూరు, శ్రీకాళహస్తి, కేవీబీపురం, తిరుపతి తదితర చోట్ల జరిగిన ర్యాలీల్లో వంద శాతం పార్టీ కార్యకర్తలే కనిపించారు. చంద్రగిరిలో వలస కూలీలను, మహిళలను డబ్బు పంపిణీ చేసి రప్పించగా, మిగిలిన చోట్ల పూర్తిగా కార్యకర్తలతోనే ర్యాలీలు నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రాపూరులో ర్యాలీ జరగగా నగరి నియోజకవర్గంలో ర్యాలీ జరగలేదు.
ట్రాఫిక్ అంతరాయం
చంద్రగిరిలో వైసీపీ నిర్వహించిన ర్యాలీ కారణంగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలకే వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిలోని ఫ్లైఓవర్ వద్దకు చేరుకోవడంతో తిరుపతి నుంచి చిత్తూరు వైపు, చిత్తూరు, పాకాల నుంచి తిరుపతి వైపు వెళ్ళే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. వైసీపీ శ్రేణులు నడిరోడ్డుపై జెండాలు పట్టుకుని నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరుపతి నుంచి చంద్రగిరికి వచ్చే వాహనాలను తొండవాడ వద్ద జాతీయ రహదారికి మళ్ళించారు. సోమవారం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.