Panchayats: సంస్కరణల బాటలో పంచాయతీలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:58 AM
గ్రామ పంచాయతీల్లో సుపరిపాలన, మరింత జవాబుదారీతనం లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది.భౌగోళిక విస్తీర్ణం, జనాభా, ఆదాయం ప్రాతిపదికన పంచాయతీలను నాలుగు రకాలుగా వర్గీకరించింది.
తిరుపతి(కలెక్టరేట్), జూలై 20 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో సుపరిపాలన, మరింత జవాబుదారీతనం లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది.భౌగోళిక విస్తీర్ణం, జనాభా, ఆదాయం ప్రాతిపదికన పంచాయతీలను నాలుగు రకాలుగా వర్గీకరించింది.తిరుపతి జిల్లాలో మొత్త 811 గ్రామ పంచాయతీలున్నాయి.ఫ10వేల జనాభా దాటి వార్షికాదాయం రూ.కోటికిపైగా వున్న 16 గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా వర్గీకరించారు.చంద్రగిరి, కోడూరు, నాగలాపురం, నారాయణవనం,మంగంపేట, దామలచెరువు, కరకంబాడి, తూకివాకం, పాకాల, రేణిగుంట, సత్యవేడు, అవిలాల, పేరూరు, తిరుచానూరు, వి.మంగళం, శ్రీనివాసపురం రూర్బన్ పంచాయతీల కిందకు వచ్చాయి.ఫ 3వేల నుంచి 10వేల లోపు జనాభా, వార్షిక ఆదాయం రూ.30లక్షల నుంచి రూ.కోటిలోపు ఆదాయం ఉన్న 102పంచాయతీలను గ్రేడ్-1గా గుర్తించారు.ఫ 2వేల నుంచి 3వేల జనాభా లోపున్న 117పంచాయతీలను గ్రేడ్-2కిందకు తీసుకొచ్చారు.ఫ 2వేల లోపు జనాభా ఉన్న 576 పంచాయతీలను గ్రేడ్-3గా నిర్ధారించారు.
కార్యదర్శి హోదా అప్‌గ్రేడ్
పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ అభివృద్ధి అధికారి(పీడీవో)గా ప్రభుత్వం మార్చింది. క్లస్టర్ గ్రామపంచాయతీ విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూర్బన్ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్, బిల్‌కలెక్టర్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతోపాటు స్కేల్ పెంచింది. పట్టణ తరహాలో మౌలిక సదుపాయాలు, పౌర సేవలు ఇక పంచాయతీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇంజనీరింగ్, ప్రణాళిక, ప్రజారోగ్యం, రెవెన్యూ విభాగాల సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
గ్రామాల్లోను ఈ-గవర్నెన్స్
పంచాయతీల పరిధిలోను ఈ-గవర్నెన్స్ అమలుకు ప్రభుత్వం అనుమతించింది. కమిషనర్ కార్యాలయం నుంచి పంచాయతీ స్థాయిలోనే ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం పంచాయతీ సాధారణ నిధుల నుంచి ఒక శాతం నిధులను ఖర్చుచేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
పరిపాలన మరింత వేగవంతం
పట్టణ ప్రాంతాలను ఆనుకుని జనాభా, ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న రూర్బన్ పంచాయతీల్లో సీనియర్‌అసిస్టెంట్ కేడర్ అధికారులు అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ స్థాయిలో పైళ్ల నిర్వహణ,పన్ను వసూళ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు మరింత వేగవంతం కానున్నాయి.తాజా సంస్కరణలు గ్రామ పంచాయతీలకు వరం లాంటివని, గ్రామీణ ప్రాంతాల్లోనే పట్టణ తరహా సేవలు అందనున్నట్లు డీపీవో సుశీలా దేవి చెప్పారు.