Electric shock: విద్యుదాఘాతానికి గురై వేటగాళ్లలో ఒకరి మృతి
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:21 AM
వన్యప్రాణులను వేటాడేందుకు ముగ్గురు వెళ్లారు. కరెంటు తీగలతో ఉచ్చు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వేణు(37) మృతిచెందారు.
యాదమరి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణులను వేటాడేందుకు ముగ్గురు వెళ్లారు. కరెంటు తీగలతో ఉచ్చు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వేణు(37) మృతిచెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదమరి మండలం పాచిగుంటకు గ్రామానికి చెందిన వేణు, అరుళ్, మణిగండన్ కలిసి గురువారం రాత్రి వన్యప్రాణుల వేటకు వెళ్లారు. విద్యుత్ తీగలను బైండింగ్ వైర్లకు అనుసంధానం చేస్తుండగా వేణు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు ఈ సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేశారు. శుక్రవారం ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ శ్రీధర్ నాయుడు, ఎస్‌ఐ ఈశ్వర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణలో వన్యప్రాణుల వేటకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వేణుకు భార్య, నలుగురు పిల్లలున్నారు.
వేటగాళ్ల ఉచ్చులతో రైతులకు భయం
వన్యప్రాణులను పట్టుకుని వాటి మాంసాన్ని విక్రయించేందుకు కొందరు అటవీ ప్రాంతాల్లో కరెంటు తీగలతో ఉచ్చులు ఏర్పాటు చేస్తుండటంతో ప్రమాదాలు జరగుతున్నాయి. గత మే నెలలో తాళ్లమడుగు, ఓటేరుపల్లి అటవీ ప్రాంతాల సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులకు రాజేంద్రన్, మురుగేశన్ తీవ్రంగా గాయపడ్డారు. 2024 అక్టోబరులో తాళ్లమడుగు బీట్‌లో చిరుత ఉచ్చులో చిక్కగా, దాని గోళ్లు, దంతాలను అపహరించిన ఘటన కూడా వెలుగుచూసింది. వరుస ఘటనలతో అటవీ సమీప పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల చర్యను అరికట్టేందుకు అటవీ, పోలీసు శాఖ అధికారులు నిరంతర నిఘా, పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.