Devotees: భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - Sep 11 , 2026 | 01:35 AM
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లు చేయాలని గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) చంద్రశేఖర్‌గుప్తా ఆదేశించారు.
తిరుపతి అర్బన్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లు చేయాలని గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) చంద్రశేఖర్‌గుప్తా ఆదేశించారు. గురువారం రైల్వేస్టేషన్ ఉత్తరభవనంలోని సమావేశ మందిరంలో రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ట్రాఫిక్, టీటీడీ యంత్రాంగాలతో సమీక్షించారు. రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ఫ్లైఓవర్‌పై విపరీతంగా రద్దీ ఏర్పడుతుందని, వెంటనే క్రమబద్ధీకరించడానికి అదనపు సెక్యూరిటీని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ఉత్తరం వైపు ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ ఎయిర్‌కాన్‌కోర్స్‌ను పదిరోజుల పాటు తాత్కాలికంగా వినియోగించాలని, అందులో కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనుసంధానంగా ఉన్న ఎస్కలేటర్లు, లిఫ్టులను సైతం రన్ చేయాలన్నారు. ఆరో ప్లాట్‌ఫామ్‌కు పక్కనే ఉన్న దక్షిణభవనం మొదటి హాల్‌ను ఓపెన్ చేయాలన్నారు. తాగునీరు, టీటీడీ సహకారంతో సహాయ కేంద్రాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనంతరం నార్త్‌సైడ్ అభివృద్ధి పనులు, భారీ భూగర్భ నీటిట్యాంకు, ప్లాట్‌ఫామ్స్‌ను పరిశీలించారు. అలాగే వెస్ట్‌స్టేషన్ వద్ద నిర్మాణం జరుగుతున్న రైల్వే కల్యాణమండపాన్ని పరిశీలించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.