DOG: అ‘మృత’ ప్రేమ!
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:39 AM
అమ్మ చచ్చిపోయినా..ప్రేమ పాలను కురిసిందని తెలియదు. కుప్పం పట్టణం శాంతినగర్‌లో కనిపించిన హృదయవిదారక దృశ్యమిది.
కుప్పం,ఆంధ్రజ్యోతి: ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచిన పసికూనలవి. లోకం రీతి తెలియదు. అమ్మొక్కటే ప్రపంచం. ఆమె ప్రేమగా పొట్టలో పొదువుకుని పొదుగు కుడిపితేనే కడుపునిండేది. కుయ్ కుయ్ మంటూ ముదిగారాలు.. ఒకటితో ఒకటి సయ్యాటలు.. అన్నీ అమ్మ సమక్షంలోనే. శత్రువు ఎదరుపడితే అమ్మ కాళ్ల మధ్యే రక్షణ. బతుకు పోరులో ఆమె ఇచ్చిందే శిక్షణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎడెనిమిది కూనలవి. ఉన్నట్టుండి అమ్మ మట్టి పడకమీద పడుకుంది. మళ్లీ లేవలేదు. కూనలు శరీరాన్ని గీరుతూ లేపడానికి ప్రయత్నించాయి. లేవలేదు. లేస్తుందిలే అని సమాధానపడి అమ్మ పొట్లలో దూరి పొదుగు కు డుస్తూ పాలు తాగాయి. కొద్దిసేపటికే పొదుగు ఎండిపోయింది. పాలధార ఆగిపోయింది. పసికూనలకు ఏడవాలనీతెలియలేదు. దిగులుగా అమ్మ చుట్టే తిరిగాయి. పైనబడి పెరుకులాడాయి. వాటికి ఏమీ అర్థం కాలేదు. అమ్మ చచ్చిపోయినా..ప్రేమ పాలను కురిసిందని తెలియదు. కుప్పం పట్టణం శాంతినగర్‌లో కనిపించిన హృదయవిదారక దృశ్యమిది. అదో వీధి కుక్క. కొన్ని రోజుల క్రితం ఏడెనిమిది కూనలకు జన్మనిచ్చింది. అప్పటికే రోగం బారిన పడిన ఆ తల్లి శరీరం మరింత కృశించి పోయింది. చివరికా కుక్క.. శనివారం ఉదయం చనిపోయింది. తల్లి చావు గురించి తెలియని పిల్లలు, పొదుగును చేరి పాలను కుడిచాయి. చనిపోయినా సరే.. ఆ తల్లి కాసేపు పిల్లలకు పాలనిచ్చి వాటి ఆకలి తీర్చింది. అమ్మ ఇక లేదని తెలియని ఆ పసికూనలు, దాని పొదుగును కుమ్ముతూ ఆఖరి పాల చుక్కలు కుడుస్తున్న దృశ్యం స్థానికులను కంట తడి పెట్టించింది.