Share News

Nara Lokesh: నేడు శ్రీకాళహస్తి క్యాడర్‌తో లోకేశ్‌ భేటీ

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:57 AM

టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.మరోసారి అదే కార్యక్రమం కోసం నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన వస్తున్నారు.

Nara Lokesh: నేడు శ్రీకాళహస్తి క్యాడర్‌తో లోకేశ్‌ భేటీ
నారా లోకేశ్‌

శ్రీకాళహస్తి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరోసారి అదే కార్యక్రమం కోసం నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన వస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు, అక్రమ కేసులతో టీడీపీ శ్రేణులు నలిగిపోతున్న సమయంలో పాదయాత్ర చేసి భరోసా కల్పించిన ఆయన కష్టపడి పని చేసే ప్రతి ఒకరినీ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందని హామీ ఇచ్చారు. అదే ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో అంకితభావంతో పని చేస్తున్న వారిని ఆయన గుర్తించారు.కార్యకర్తే అధినేత పేరిట వారితో నేరుగా సమావేశమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ సమావేశం నేడు రేణిగుంట మండలం ఎల్లమంద పంచాయతీ పరిధిలోని కొత్తపల్లెలో జరగనుంది. ఈ సమావేశం కోసం నియోజకవర్గంలో మండలానికి 250మంది చొప్పున పార్టీ శ్రేణులను కేంద్ర కార్యాలయం గుర్తించింది.శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో మరో 250మందితో కలిపి మొత్తంగా సమావేశానికి 1250మందిని అనుమతించేలా చర్యలు చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని అత్యంత సామాన్యులను సైతం లోకేశ్‌ బృందం ప్రత్యేకంగా గుర్తింపునిచ్చి పేర్లు వివరాలతో సహా ఎంట్రీ పాసులు అందజేశారు.ఎక్కువమంది హాజరయ్యే బహిరంగ సభ తరహాలో కాకుండా... వినూత్నంగా క్రియాశీలకంగా ఉన్న వారితో ఆత్మీయంగా కుటుంబ సభ్యుల తరహాలో ముఖాముఖి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి ప్రశంసా పత్రాలను అందించడంతో పాటు లోకేశ్‌తో కలిసి ఫోటో తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. సమావేశా నంతరం లోకేశ్‌ శ్రీకాళహస్తి మండలం ఊరందూరులోని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి నివాసానికి చేరుకుని ఆతిథ్యం స్వీకరించి తిరుగు పయనం కానున్నారు.


లోకేశ్‌ పర్యటన ఇలా

తిరుపతి(కలెక్టరేట్‌), జూన్‌ 30(ఆంధ్రజ్యోతి):టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ బుధవారం సాయంత్రం 3.30గంటలకు రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట మండలంలోని కొత్తపల్లెకు చేరుకుని పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.తరువాత శ్రీకాళహస్తిలోని ఊరందూరులోఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నివాసానికి వెళుతారు. తిరిగి అక్కడినుంచి బయలుదేరి రాత్రి 10గంటలకు తిరుమలకు చేరుకుని బస చేస్తారు.గురువారం ఉదయం 6గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 7.40గంటలకు తిరుమల కర్ణాటక భవన్‌లో టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు.అనంతరం తిరుపతికి చేరుకునే ఆయన ఉదయం 9.30గంటలకు భూపాల్‌ హౌసింగ్‌ కాలనీకి వెళతారు. తిరిగి 9.50గంటలకు ఎస్వీ అగ్రికల్చర్‌ కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో శ్రీసిటీకి బయల్దేరి వెళతారు. 10.45గంటలకు శ్రీసిటీ ఇంటిరియమ్‌ క్యాంప్‌స ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీసిటీ హెలిప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరుగుపయనం కానున్నారు.

Updated Date - Jul 01 , 2026 | 01:57 AM