Share News

Kuppam: పర్యాటకంతో కుప్పం అభివృద్ధి

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:06 AM

పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Kuppam: పర్యాటకంతో కుప్పం అభివృద్ధి
కుప్పం చెరువుకు జలహారతి, సారె సమర్పిస్తున్న చంద్రబాబు

కుప్పం/కుప్పం రూరల్‌/గుడుపల్లె, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం మండలం కంగుందిలో డిస్ట్రిక్ట్‌ టూరిజం కౌన్సిల్‌ ఆధ్వర్యంలో రూ.35 లక్షలతో ఏర్పాటు చేసిన హెరిటేజ్‌ అండ్‌ బౌల్డరింగ్‌ పార్కును శుక్రవారం ఆయన ప్రారంభించారు. అలాగే, రూ.4 కోట్ల ఏపీఎస్బీసీఎల్‌సీఎస్సార్‌ నిధులతో కుప్పం పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పున్నమి రిసార్ట్స్‌ను, వంద అడుగుల జాతీయ జెండాను ప్రారంభించారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను, స్టాళ్లను పరిశీలించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో ఉన్న కుప్పంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనువైన ఆధ్యాత్మిక, ప్రాకృతిక ప్రదేశాలు చాలా ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాలను పర్యాటకులు ఆకర్షించేలా తీర్చిదిద్ది ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన కంగుందిలో హెరిటేజ్‌ అండ్‌ బౌల్డరింగ్‌ పార్కు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడే హోం స్టేలు, టెంట్‌ అకామిడేషన్లు ఉన్నాయని, పర్యాటకులకు మరిన్ని సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. ప్రముఖ నగరం బెంగళూరుకు దగ్గరగా ఉండడం కుప్పానికి మరింత కలిసి వచ్చే అంశమన్నారు. ఈ సందర్భంగా డిస్కవర్‌ టూరిజం వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. కుప్పంలోని పర్యాటక ప్రాంతాలకు ఈ వెబ్‌సైట్‌ విస్తృత ప్రచారం కల్పిస్తుందన్నారు.

విద్యార్థులతో ముఖాముఖి

అంతకుముందు గుడుపల్లె మండలం అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న టీచర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించారు. రకరకాల కిట్లతో సాగుతున్న శిక్షణ తీరును పరిశీలించారు. పిల్లలకు బోధించేందుకు తీసుకుంటున్న శిక్షణ విధానాన్ని టీచర్లు వివరించారు. అగస్త్య విద్యాచల్‌ అకాడమీలోని ఆడిటోరియంలో విద్యార్థులతో సీఎం సమావేశమయ్యారు. అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక అంశాలపై అందిస్తున్న శిక్షణ వీడియోను వారితో కలిసి వీక్షించారు. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అగస్త్య ఫౌండేషన్‌ చైర్మన్‌ రామ్‌జీ రామన్‌తో తనకు పాతికేళ్లనుంచి పరిచయం ఉందన్నారు. ఆయన కోరిక మేరకు కుప్పంలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించామన్నారు. పాతికేళ్లుగా ఈ అకాడమీని సమర్థంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని అందిపుచ్చుకుని ఐటీ రంగంలో తెలుగువాళ్లు విస్తరించారన్నారు. గతంలో ఐటీని, ఇప్పుడు ఏఐని ప్రమోట్‌ చేస్తున్నానని, అందరూ ఆయా పరిజ్ఞానం పెంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా, హెలిప్యాడ్‌ వద్ద చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, కె.మురళీమోహన్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు, మనోహర్‌, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, రెస్కో చైర్మన్‌ వీజీ ప్రతాప్‌, ఏఎంసీ చైర్మన్‌ జీఎం రాజు, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ తుషార్‌ డూడి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.


రెండు గంటలు ఆలస్యంగా రాక

కుప్పం/శాంతిపురం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):తొలిరోజైన శుక్రవారం సీఎం చంద్రబాబు షెడ్యూల్‌కంటే 2 గంటలు ఆలస్యంగా వచ్చారు. సాయంత్రం 4.15 గంటలకు సీఎం అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అగస్త్య విద్యాచల్‌ అకాడమీ ప్రాంగణంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన టీచర్ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న లెర్నర్స్‌ అకామిడేషన్‌ ఫెసిలిటీ సెంటర్‌కు, రూ.2 కోట్లతో నిర్మించనున్న ఒబెరాయ్‌ విజిటర్స్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం కుప్పం చెరువువద్ద కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. ఇక్కడినుంచి బయలుదేరి కుప్పం మండలం కంగుందికి చేరుకున్నారు. అక్కడి కార్యక్రమాలను ముగించుకుని కుప్పం బైపాస్‌ రోడ్డులో ప్రభుత్వ గ్రంథాలయం, ఆదిత్యబిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.

Updated Date - Jan 31 , 2026 | 02:06 AM