Share News

Tirumala: వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:05 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం కైశికద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈమేరకు వేకువజామున 4.30 నుంచి 5.45 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

Tirumala: వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం
ఉగ్రశ్రీనివాసమూర్తి

తిరుమల, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం కైశికద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈమేరకు వేకువజామున 4.30 నుంచి 5.45 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశికద్వాదశిరోజున మాత్రమే సూర్యోదయానికి ముందు ఆలయం నుంచి వెలుపలకు తీసుకువచ్చి మాడవీఽధుల్లో ఊరేగిస్తారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి వద్ద వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశికద్వాదశి ఆస్థానాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఏడాదికి ఒక్కసారిగా మాత్రమే ఆలయం నుంచి వెలుపలకు వచ్చే దేవుడు కావడంతో పాటు కార్తీకమాసం, పైగా శనివారం కూడా జతైన నేపథ్యంలో వేకువజామున భక్తులు భారీగా ఊరేగింపులో పాల్గొన్నారు. గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఉగ్రశ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జీయర్‌స్వాములు, ఈవో రవిచంద్ర, జేఈవో శరత్‌, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 01:05 AM