Share News

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:20 AM

జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
ఇంటర్‌ పరీక్షలపై టెలికాన్ఫరెన్స్‌లో సూచనలు ఇస్తున్న డీఐఈవో రఘుపతి

చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. చిత్తూరు నుంచి ఆదివారం ఆయన చీఫ్‌ సూపరింటెండెంట్లు, అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలను గుర్తు పట్టేలా ప్రతి కేంద్ర ముందు సెంటర్‌ కోడ్‌తో బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పొరబాటున ఎవరైనా పరీక్షా కేంద్రాలు మారి వస్తే.. వారు సరైన పరీక్షా కేంద్రం చేరేలా చూడాలన్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను చెకింగ్‌ పేరుతో ఎక్కువ సేపు బయట నిలబెట్టరాదన్నారు. హాల్‌ టికెట్లు లేని విద్యార్థులను వెంటనే పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపరాదని, ఇలాంటి విషయాలను తమ దృష్టి తీసుకురావాలని సూచించారు. క్యాంపస్‌ క్లీన్‌గాను, ప్రతి గదిలో వెలుతురు, ఫ్యాన్లు పనిచేసేలా చూసుకోవాలన్నారు. ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలపై ఉందన్నారు. ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:20 AM