Insects: కీటకాలు కుట్టి అలర్జీ, మంటలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:45 AM
కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం కీటకాలు కుట్టి 19 మంది విద్యార్థులకు అలర్జీ(దురద), మంటలు వచ్చాయి. వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించి, బడికి సెలవు ప్రకటించారు. ఈ ఘటనతో కలకలం రేగింది.
వెదురుకుప్పం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం కీటకాలు కుట్టి 19 మంది విద్యార్థులకు అలర్జీ(దురద), మంటలు వచ్చాయి. వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించి, బడికి సెలవు ప్రకటించారు. ఈ ఘటనతో కలకలం రేగింది. ఈ పాఠశాలలో 137 మంది విద్యార్థులు ఉన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకంతా వచ్చిన విద్యార్థుల్లో కొందరు పాఠశాల ఆవరణలో ఆటల్లో మునిగిపోయారు. 8.45 గంటల సమయంలో తమను ఏదో కీటకం కుట్టిందని, ఒళ్లంతా దురద, మంటలు వస్తున్నాయని ముగ్గురు విద్యార్థులు చెప్పారు. ఆ తర్వాత మరికొందరు చెప్పడంతో ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఈ విషయం దానవాలంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఆరోగ్య సిబ్బంది, ఊరిలో జనంకు తెలియడంతో అందరూ పాఠశాల వద్దకు చేరుకున్నారు. దురద, మంటలు భరించలేకున్నామని విద్యార్థులు ఏడుస్తున్నారు. మొత్తం 19 మందిని 108 అంబులెన్స్ ద్వారా పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఐదుగురికి వాంతులయ్యాయి. ఎంపీడీవో రాధిక సింగిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భువనేశ్వరి, ఎంఈవోలు విజయకుమార్, మనోజ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్, ఇతరులు పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానించిన చెట్టు కొమ్మను కొట్టించారు. మరోవైపు.. తమ పిల్లలను ఇళ్లకు పంపించేయాలని తల్లిదండ్రులు రచ్చకు దిగారు. దీంతో పాఠశాలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను హెచ్‌ఎం నాదముని, కొందరు ఉపాధ్యాయులు పరామర్శించారు. విద్యార్థులను సాయంత్రం డిశ్చార్జి చేశారు. నగరి ఆర్డీవో అనుపమ, పుత్తూరు డీవైఈవో మహేశ్వరరావు కూడా ఆస్పత్రికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కాగా, 19 మంది విద్యార్థులకు ఎలాంటి సమస్య లేదని, ఎందువల్ల జరిగిందో కచ్చితంగా తెలియడం లేదని కత్తెరపల్లి పీహెచ్‌సీ డాక్టర్ భువనేశ్వరి తెలిపారు.