Palamaner: పలమనేరులో వినూత్న తరహా మోసాలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:47 AM
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 20 కిలోమీటర్ల దూరంలోని పలమనేరులో ఆర్థిక మోసగాళ్లు ఎక్కువయ్యారు. వినూత్న తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.
పలమనేరు, ఆంధ్రజ్యోతి: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు 20 కిలోమీటర్ల దూరంలోని పలమనేరులో ఆర్థిక మోసగాళ్లు ఎక్కువయ్యారు. వినూత్న తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి చర్యతో ఎందరో ఆర్థికంగా చితికిపోయారు. తాజాగా పెండింగులోని ట్రేడ్ లైసెన్సు సొమ్ము చెల్లించాలంటూ వ్యాపారులకు క్యూఆర్ కోడ్ పంపారు. పోలీసుల నిఘా లేకపోవడం.. ప్రజలూ అప్రమత్తంగా కాకపోవడంతో ఈ తరహా మోసాలు ఎక్కువవుతున్నాయి.
ఏడాదిన్నర కిందట పలమనేరు మున్సిపాలిటీ మెప్మాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజేష్ ‘డాయ్ ఆప్’ అనే యాప్ ద్వారా వందలాది మంది చేత చైన్ లింక్ వ్యాపారం చేయించాడు. ఇతడు మొదట నమ్మకంగా చెప్పినట్లు పెద్ద మొత్తంలో ఆదాయం రాకపోగా, జనం కట్టిన సొమ్ములు కూడా పోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికీ బాధితులకు ఎటువంటి న్యాయం చేయలేకపోయారు.
పలమనేరులో ఏడాది వ్యవధిలోనే 10 మందికి పైగా రూ.లక్షల్లో అప్పుచేసి, చివరకు ఐపీ పెట్టారు.
ఏడాది క్రితం ఒక ప్రముఖ ఫైనాన్సు కంపెనీలో పనిచేసే సిబ్బంది సరాసరి నకిలీ బంగారు తాకట్టుపెట్టి లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫైనాన్సు కంపెనీకి సంబంధించిన లావాదేవీలు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయలేక కొంతమేర నగదును రికవరీ చేశారు. ఈ కేసులో కొందరు పలమనేరు వదిలి పారిపోయి, రెండు నెలల తర్వాత వచ్చారు.
ఇక, పలమనేరుకు చెందిన వెంకటరావు అనే వ్యాపారి ప్రజలనుంచి చీటీల పేరుతోను, అప్పుల పేరుతోను పెద్ద మొత్తంలో తీసుకున్నాడు. తిరిగి చెల్లించాల్సింది రూ.13 కోట్లు దాటింది. వ్యాపారాల్లో భారీగా నష్టపోయిన తాను ఆ అప్పులు చెల్లించలేక పోతున్నాని పేర్కొంటూ ఐపీ పెట్టారు. ఈ ఘటనలో 200 మందికిపైగా బాధితులయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ వీరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని ఆశ్రయించారు. పలుమార్లు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. చీటీలు వేసిన వారికి నిర్వాహకులు సొమ్ములు చెల్లించకపోవడమనేది పలమనేరు పట్టణంలోనే కాదు.. సమీప గ్రామాల్లోనూ పరిపాటైంది. చేసేదేమీ లేక బాధితులు మౌనం వహిస్తున్నారు. కొందరు చీటీలు వేసిన వ్యక్తులు సక్రమంగా సొమ్ములు చెల్లించక పోవడంతో నిర్వాహకులూ నష్టపోయిన సంఘటనలున్నాయి.
తాజాగా పెండింగ్‌లో ఉన్న ట్రేడ్ లైసెన్సు మొత్తాన్ని తాము పంపుతున్న క్యూఆర్‌కోడ్‌కు పంపాలంటూ వ్యాపారులకు ఫోన్లు చేశారు. యూపీఐ ద్వారా బకాయిలను క్లియర్ చేయాలంటూ క్యూఆర్ కోడ్‌నూ పంపారు. ఈ నెంబరును ట్రూకాలర్‌లో చూస్తే మున్సిపల్ కమిషనరు అని రావడంతో కొందరు వ్యాపారులు నమ్మి డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ మోసం నాలుగు రోజుల కిందట వెలుగు చూసింది.
చర్యలు తీసుకొంటేనే..
ఇటువంటి మోసాలు వెలుగులోకి వచ్చినప్పుడు పోలీసులు హడావిడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అలాకాకుండా, ఇలాంటి వారిపై నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకొంటే కొంతవరకు మోసాలను అరికట్టొచ్చు. మరోవైపు ప్రజలనూ చైతన్యవంతులను చేయాలి. అప్పుడే పూర్తిస్థాయిలో ఆర్థిక మోసగాళ్లకు చెక్ పడుతుంది.