Share News

Police Station: పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:01 AM

గుడుపల్లె మండలంలోని పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Police Station: పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌
పొగురుపల్లె ప్రాంతంలో జోరుగా సాగుతున్న పరిశ్రమల పనులు

చిత్తూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గుడుపల్లె మండలంలోని పొగురుపల్లెలో ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వందల సంఖ్యలో పరిశ్రమలున్న తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో కూడా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్‌ పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పొగురుపల్లెలోనూ రూ.9300 కోట్లతో 30 భారీ పరిశ్రమలకు ఇటీవల సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో ఇక్కడా శ్రీసిటీ తరహాలో ఏర్పాటు చేయనున్నారు. కాగా, పొగురుపల్లె ప్రాంతంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేశాక ఆయా భారీ పరిశ్రమలు జోరుగా పనుల్ని ప్రారంభించాయి. నిర్మాణానికి సంబంధించిన వస్తువులు ఆరు బయటే పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో 10 రోజుల్లోనే సుమారు రూ.70 లక్షల విలువచేసే కాపర్‌ కాయిల్‌ వంటి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇక, ఇక్కడి ఇండస్ట్రియల్‌ పార్కులో సిద్ధంగా ఉన్న 167 ప్లాట్లలో కూడా చిన్నస్థాయి పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. పరిశ్రమలఏర్పాటు సమయంలో, పూర్తయ్యాక పోలీసుల పర్యవేక్షణ తప్పనిసరిగా మారింది.తొలుత ఓ ఏఎ్‌సఐ,కొంతమంది కానిస్టేబుళ్లతో పోలీస్‌ అవుట్‌పోస్టును ఏర్పాటుచేస్తే బాగుంటుందా.. నేరుగా ఎస్‌ఐ ఎస్‌హెచ్‌వోగా పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందా.. అనే విషయమై పోలీసు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. శ్రీసిటీ ప్రారంభ దశలో అవుట్‌పోస్టును ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అక్కడ డీఎస్పీ ఎస్‌హెచ్‌వోగా ఉన్నారు. ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, పదుల సంఖ్యలో కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు.


ఏఎస్పీని నియమిస్తే ఎలా ఉంటుంది?

‘కుప్పంలో ఎలాంటి ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ జరగకూడదు, అవసరమైతే ఏఎస్పీను నియమిద్దాం’ అని ఇటీవల తన పర్యటనలో సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో ఏఎస్పీని నియమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ కడ పీడీగా ఉన్నారు. ఈయన నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల్ని తేవడం, వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వారికి స్థలాలు కేటాయించడం.. వంటిపనుల్లో వేగంగా స్పందిస్తున్నారు. సీఎంకూ ఈయన మీద సదాభిప్రాయం ఉంది. కానీ, ఐఏఎస్‌ అధికారి కావడంతో క్షేత్రస్థాయిలో సామాన్యులకు అందుబాటులో ఉండలేకపోతున్నారనే ఆరోపణ ఉంది. ఈ క్రమంలో ఐపీఎస్‌ అధికారిని ఏఎస్పీగా నియమిస్తే, స్థాయిని బట్టి సామాన్యులకు దూరం అవుతారనే చర్చ కూడా ఉంది. ఇక్కడి నాలుగు మండలాలకు డీఎస్పీ అధికారి సరిపోతారనేది కొంతమంది పోలీసుల వాదన.

Updated Date - Jul 21 , 2026 | 01:01 AM