Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:36 AM
వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది.
తిరుమల, జనవరి 1(ఆంధ్రజ్యోతి): వైకుంఠద్వార దర్శనానికి సర్వదర్శన భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటిన టోకెన్లున్న భక్తులకే దర్శనం కల్పించడంతో రద్దీ మోస్తరుగా కనిపించింది. శుక్రవారం నుంచి టోకెన్లు లేకపోయినా దర్శనాలకు అనుమతించడంతో గురువారం సాయంత్రం 5 గంటల నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అక్టోపస్ భవనం సర్కిల్ నుంచి సర్వదర్శన భక్తులను క్యూలోకి తీసుకున్నారు. రాత్రి 8 గంటలకు నారాయణగిరి షెడ్లు కూడా నిండాయి. ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని కంపార్టుమెంట్లలోని అనుమతించారు. అర్ధరాత్రి వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్1లోకి చేరిన స్లాటెడ్ భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత సర్వదర్శనాలు మొదలుపెట్టేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. శుక్రవారం అభిషేకసేవ ఉన్న క్రమంలో సర్వదర్శన భక్తులు బయటి క్యూలైన్లలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అవసరమైతే వారిని యాత్రికుల వసతి సముదాయాల వద్దకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఆక్టోపస్ భవనం వద్ద ఉంచారు. అభిషేకం తర్వాత యాదావిఽధిగా వీరిని క్యూలైన్లలోకి అనుమతించనున్నారు.
తోపులాటకు ఆస్కారం లేకుండా..
అదనపు క్యూ లైన్లలో ముందుకు కదిలే క్రమంలో భక్తుల మధ్య తోపులాటలు, తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. కంపార్టుమెంట్ల తరహాలో ప్రతి వంద మీటర్ల వరకు అడ్డుగా ఓ ఇనుప బ్యారికేడ్‌ను ఏర్పాటు చేశారు. భక్తులను విడతలవారీగా ముందుకు పంపుతున్న క్రమంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా భక్తులు ముందుకు సాగుతున్నారు. గురువారం రాత్రి ఎస్పీ సుబ్బరాయుడు అధికారులతో కలిసి క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.