Elnino:సాగుపై ఎల్‌నినో పంజా
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:42 AM
ఎల్‌నినో ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 173మి.మీకు కేవలం 50మి.మీ. నమోదైంది. అది కూడా కొన్ని మండలాలకే పరిమితమవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళనలో రైతులు
తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి: తిరుపతిలో ఖరీఫ్, రబీ సీజన్లు ముందే వస్తాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 60 రోజులు దాటినా.. ఒకటి రెండుసార్లు తప్ప వర్షం పడ్డ దాఖలాల్లేవు. జిల్లాలో సుమారు 1.10లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయి. 2.5 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వరి, చెరకు, వేరుశనగ సుమారు 35వేల హెక్టార్లలో సాగవుతోంది. నిమ్మ, మామిడి, అరటి, బొప్పాయి. టమోటా తదితర ఉద్యాన పంటలు 75వేల హెక్టార్లలో సాగవుతున్నాయి. వర్షాభావం కారణంగా పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, ఆర్సీపురంతోపాటు రైల్వేకోడూరులోని కొన్ని మండలాల్లో వేరుశనగ సగం మాత్రమే సాగు చేశారు. వరి పంట పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలాగే కొనసాగితే పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రబీకి ప్రతికూలమే..
అక్టోబరులో ప్రారంభమయ్యే రబీ సీజన్‌పైనా ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనుంది. వరి సాధారణ విస్తీర్ణం 35వేల హెక్టార్లు కాగా రబీలో 10వేల హెక్టార్లకు మించి సాగయ్యే అవకాశం లేదని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. రైతులు ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటలైన రాగి, సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
వర్షాలు కురవక పోవడంతో..
జూలై రెండో వారం వస్తున్నా వర్షాలు కురవక పోవడంతో జిల్లాలోని జలాశయాలు అడుగంటుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు ఎండిపోతున్నాయి. తూర్పు మండలాల రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిపైనే సాగు విస్తీర్ణం ఆధార పడి ఉంది. కండలేరు, కృష్ణాపురం, అరణియార్, కాళంగి రిజర్వాయర్ల కింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కండలేరు పరిస్థితి ఇదీ..
కండలేరు సామర్థ్యం 68.030 టీఎంసీలు. వర్షాలు కురకవపోవడంతో రిజర్వాయర్ సగానికి అడుగంటి ప్రస్తుతం నీటి నిల్వ 30.840టీఎంసీలుగా ఉంది. చెన్నై, తిరుపతినగరాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉండటంతో అయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని అందించే అవకాశం లేదని జలవనరుల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి : వెంకటేశ్వర్, కలెక్టర్
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే జలధార-జలహారతితో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాం. వర్షం లేకపోవడంతో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాలపై రైతులు దృష్టి సారించాలి. పీఎండీఎఫ్ విత్తనాలను 50వేల ఎకరాల్లో చల్లాం. స్వల్పకాలిక పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వచ్చేనెలలో ఉలవ విత్తనాలను కూడా పంపిణీ చేస్తాం.
నీటి మట్టాలు (టీఎంసీల్లో)
రిజర్వాయర్ సామర్థ్యం ప్రస్తుతం ఇన్‌ఫ్లో
సోమశిల 77.988 35.080 0
కండలేరు 68.030 30.840 0
మల్లిమడుగు 0.181 0.005 0
కృష్ణాపురం 0.199 0.047 0
అరణియార్ 1.853 0.902 0
కాళంగి 0.241 0000 0