TTD: టీటీడీ ఉద్యోగులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:07 AM
టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని టీటీడీ సెంట్రల్ ఆస్పత్రిలో ఈవో రవిచంద్ర శనివారం ప్రారంభించారు.
తొలి విడతలో 2 వేల డోసుల సేకరణ
తిరుపతి(టీటీడీ), నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉచితంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని టీటీడీ సెంట్రల్ ఆస్పత్రిలో ఈవో రవిచంద్ర శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు అత్యాధునిక గార్డాసిల్-9 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 9 నుంచి 25 ఏళ్లలోపు వారికి ఈ టీకా వేయనున్నట్లు చెప్పారు. తొలి విడతలో 2వేల డోసులను సేకరించామని, అవసరాన్ని అనుసరించి మరిన్ని డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. టీటీడీ సీఎంవో డాక్టర్ కుసుమకుమారి మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు ఇతర హెచ్‌పీఈ సంబంధిత క్యాన్సర్ల ముప్పును తగ్గించవచ్చన్నారు. హెచ్‌పీవీకి చెందిన తొమ్మిది రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం గార్డాసిల్-9 ప్రత్యేకత అని వివరించారు.గార్డాసిల్-9 వ్యాక్సిన్ ఒక్కో డోసుకు టీటీడీకి రూ.3వేలు ఖర్చవుతుండగా, మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.13వేల నుంచి రూ.14వేలకు పైగా ఉందని అధికారులు తెలిపారు. 9 నుంచి 14 ఏళ్లలోపు వారికి మొదటి డోసు అనంతరం ఆరు నెలలకు మరో డోసు వేసుకోవాలి. 15 నుంచి 25 ఏళ్లలోపు వారికి మొదటి డోసు, రెండో నెలకు రెండో డోసు, ఆరు నెలలకు మూడో డోసు వేసుకోవాలని అధికారులు తెలిపారు. డిప్యూటీ ఈవో ఆనందరాజు, డాక్టర్ శివకుమార్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.