Tirumala: తిరుమలలో భారీ వర్షం
ABN , Publish Date - May 19 , 2026 | 12:42 AM
తిరుమలలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ రాత్రి సమయానికి నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి.
తిరుమల, మే 18(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ రాత్రి సమయానికి నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. ఒక్కసారిగా చలిగాలులు వీయడం మొదలైంది. రాత్రి 9 గంటలకు వర్షం ప్రారంభమై సుమారు 30 నిమిషాల పాటు ఎడతెరిపిలేకుండా కురిసింది. భారీగా కురవడంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.ఎత్తు ప్రాంతాల నుంచి వర్షపు నీరు జోరుగా ప్రవహించాయి. తిరుమల మొత్తం తీవ్రమైన చలివాతావరణం నెలకొంది.
భానుడి ప్రతాపానికి జనం బెంబేలు
తిరుపతి(కలెక్టరేట్), మే 18(ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోయారు. సోమవారం తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు బెంబేలెత్తారు. ఆర్‌సీపురం మండలంలో 42.8 అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా దొరవారిసత్రంలో 42, తిరుపతి రూరల్‌లో 41.8, తిరుపతి అర్బన్‌లో 41.4, పెనగలూరులో 41.1, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో 41, నాయుడుపేటలో 40.9, రేణిగుంట, వెంకటగిరి మండలాల్లో 40.7, సూళ్ళూరుపేటలో 40.6, డక్కిలిలో 40.4, పెళ్లకూరులో 40.3, పిచ్చాటూరులో 40.2, బీఎన్‌కండ్రిగ,ఓజిలి మండలాల్లో 40.1, చంద్రగిరి, బాలాయపల్లె, వడమాలపేట మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణశాఖ అంచనాలతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జిల్లా అధికారులు సూచించారు.