Share News

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:06 AM

వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.

Resurvey: నేటినుంచి నాల్గవ విడత రీసర్వే

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): భూములకు జాయింట్‌ ఎల్‌పీ నెంబర్లు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు, నిషేధిత జాబితాలోకి వెళ్లిపోవడం.. ఇలా వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.

వెంటాడుతున్న వైసీపీ నిర్వాకం

వైసీపీ పాలనలో చేసిన సర్వే రైతులను ఇప్పటికీ తిప్పలు పెడుతోంది. రుణాలు రాక.. క్రయ, విక్రయాలు జరగక, పాసుపుస్తకాలు రాకుండా అవస్థ పడుతున్నారు. వందల ఎకరాల్లోని భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి.

నేర్చుకోవాలి పాఠాలు

గతంలో రైతులకు సమాచారం ఇవ్వకుండా, వారు స్థానికంగా లేకున్నా సర్వే చేపట్టడం సమస్యలకు ప్రధాన కారణమైంది. జాయింట్‌ ఎల్‌పీ నెంబర్ల సమస్య వచ్చింది. నిబంధన ప్రకారం రైతుకు రెండు రోజుల ముందే సమాచారం నోటీసు రూపంలో అందించాలి. గతంలో రీసర్వే ప్రాంతాల్లో మొక్కుబడిగా గ్రామసభలు నిర్వహించడంతో దానిపై రైతులకు అవగాహనే లేకపోయింది. ఈసారి ముందుగా సమాచారం ఇచ్చి రైతులంతా గ్రామసభల్లో పాల్గొనేలా ప్రచారం చేయాలి. సర్వేలో గ్రామ సర్వేయర్‌, వీఆర్వోలు తప్పనిసరిగా ఉండాలి. ఏ ఒక్కరూ లేకున్నా తప్పులు దొర్లే అవకాశం ఉంది. రైతులు సైతం అధికారులు చెప్పిన సమయానికి అందుబాటులో ఉంటే సమస్యలు రావు.

సమగ్రంగా..

రీ సర్వే జరిగే గ్రామాల సంఖ్య: 192

బృందాలు : 162

ప్రభుత్వ భూములు(ఎకరాలు): 9,56,83.35

పట్టాభూములు: 2,48,967.62

మొత్తం భూములు: 3,44,650.97

సర్వే పూర్తయిన ప్రభుత్వ భూమి: 58,237

సర్వే చేయాల్సింది: 2,86,414

సర్వేకు సిద్ధంగా ఉన్న రోవర్లు: 83

Updated Date - Jan 02 , 2026 | 01:06 AM