Share News

TDP: నాడు మామ.. నేడు అల్లుడు

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:42 AM

పీఆర్‌ మోహన్‌కు ఎన్టీ రామారావు దగ్గరుండి పెళ్లి జరిపించగా.. 31 ఏళ్ల తర్వాత చంద్రబాబు సమక్షంలో మోహన్‌ కుమార్తె వివాహం జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన శాప్‌ మాజీ చైర్మన్‌, దివంగత పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి ఆదివారం సీఎం చంద్రబాబు హాజరవడంతో పలువురు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

TDP: నాడు మామ.. నేడు అల్లుడు
1995 మే నెలలో పీఆర్‌ మోహన్‌ పెళ్లి జరిపిస్తున్న ఎన్టీఆర్‌ - ఆదివారం.. వరుడు రాజే్‌షకు తాళిబొట్టు అందిస్తున్న సీఎం చంద్రబాబు

శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి: పీఆర్‌ మోహన్‌కు ఎన్టీ రామారావు దగ్గరుండి పెళ్లి జరిపించగా.. 31 ఏళ్ల తర్వాత చంద్రబాబు సమక్షంలో మోహన్‌ కుమార్తె వివాహం జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన శాప్‌ మాజీ చైర్మన్‌, దివంగత పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి ఆదివారం సీఎం చంద్రబాబు హాజరవడంతో పలువురు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

అది.. 1995 మే నెల. ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు తిరుపతి పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పీఆర్‌ మోహన్‌ ప్రేమ పెళ్లికి హాజరయ్యారు. స్వయంగా ఆయనే పూల దండలు మార్పించారు. ఇలా ఎన్టీఆర్‌ దండలు మార్పించిన సమయమే సుముహూర్తంగా పీఆర్‌ మోహన్‌, ఇందిర జంట ఒక్కటయ్యారు.

తాజాగా, తొట్టంబేడు మండలం సీఆర్‌ఎన్‌కండ్రిగలోని సీసీఎన్‌ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన పీఆర్‌ మోహన్‌ కుమార్తె డింపుల్‌ వివాహానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.31 గంటలకు కల్యాణ మండపానికి చేరుకున్నారు. తన చేతుల మీదుగా తాళిబొట్టును వరుడు రాజే్‌షకు అందజేశారు. సీఎం సమక్షంలోనే మాంగళ్యధారణ జరిగింది. నవ దంపతులైన డింపుల్‌, రాజే్‌షలకు చంద్రబాబు ఆశీస్సులు అందజేశారు.

ఇలా.. పీఆర్‌ మోహన్‌ పెళ్లిని ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో దగ్గరుండి జరిపిస్తే, ఇప్పుడు ఆయన కుమార్తె డింపుల్‌ వివాహం.. ఎన్టీఆర్‌ అల్లుడు సీఎం చంద్రబాబు సమక్షంలో జరగడం విశేషం.

చంద్రబాబు పర్యటన సాగిందిలా.. : హెలికాప్టర్‌లో వచ్చిన చంద్రబాబు.. శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రిలోని హెలిప్యాడ్‌లో దిగారు. తర్వాత రోడ్డుమార్గాన సీసీఎన్‌ కల్యాణ మండపం వద్దకు చేరుకోగా.. పీఆర్‌ మోహన్‌ సతీమణి ఇందిర స్వాగతం పలికారు. డింపుల్‌, రాజే్‌షల వివాహం జరిగాక మధ్యాహ్నం 12.42గంటలకు అక్కడినుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి (శ్రీకాళహస్తి), విజయశ్రీ (సూళ్లూరుపేట), ఆదిమూలం (సత్యవేడు), ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌వర్మ, ముక్కంటి ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గురవారెడ్డి, తుడా చైర్మన్‌ దివాకర్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కమిషనర్‌ జయకృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు గాలి చలపతినాయుడు, రావిళ్ల మునిరాజానాయుడు, విజయకుమార్‌, కంఠా రమేష్‌ తదితరులు స్వాగతం, వీడ్కోలు పలికారు.


కార్యకర్తల్లో ఆనందం

టీడీపీ నాయకుడి కుమార్తె వివాహానికి తమ అధినేత రావడంతో కార్యకర్తలో ఆనందం నెలకొంది. పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

ఆద్యంతం క్రమశిక్షణ

అలాగే చంద్రబాబు పర్యటనలో నేతలు, కార్యకర్తలు ఆద్యంతం క్రమశిక్షణతో మెలిగారు. ‘ఇటీవల కొందరు నాయకులు ఇలాంటి వేడుకలకు హాజరైన సమయంలో ఆ ప్రాంగణాన్ని హోరెత్తిస్తూ.. విస్తృత ప్రచారం చేసుకుంటున్న ఉదంతాలను చూస్తున్నాం. కానీ చంద్రబాబు పర్యటనలో అలాంటివేమీ కనిపించలేదు’ అని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.

Updated Date - Aug 31 , 2026 | 01:42 AM