Mango: మామిడి చెట్లను నరికేస్తున్న రైతులు
ABN , Publish Date - May 31 , 2026 | 12:44 AM
ఏటా నష్టాలను మిగుల్చుతున్న మామిడి సాగు పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు. నిరుత్సాహానికి లోనై మామిడి చెట్లను నరికేసి ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
పుత్తూరు టౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి): ఏటా నష్టాలను మిగుల్చుతున్న మామిడి సాగు పట్ల రైతులు విరక్తి చెందుతున్నారు. పూత దశ నుంచి పంట దిగుబడి, విక్రయం వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంతో పాటు యాజమాన్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడం, మంచి దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నిరుత్సాహానికి లోనై మామిడి చెట్లను నరికేసి ఇతర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో, అధిక దిగుబడి ఇచ్చే ఆరుతడి పంట, పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంటకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు.
ఉచితంగా మొక్కల పంపిణీ: వెంకట సౌజన్య, ఉద్యాన శాఖాధికారి,పుత్తూరు
ప్రభుత్వం రైతులకు ఉచితంగా పామాయిల్ మొక్కలు పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా సాగు ఖర్చులు, మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఈ పంటకు ఎటువంటి తెగుళ్లు సోకవు. మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. జంతువులు, పక్షుల వల్ల ఎలాంటి పంట నష్టం వాటిల్లదు. మొక్క నాటిన ఐదేళ్ల లోపే కాపు కాస్తుంది. ఎకరాకు రూ.50 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుంది.