Share News

Farmers: పంటల బీమాపై ఆసక్తి చూపని రైతులు

ABN , Publish Date - Jul 31 , 2026 | 02:04 AM

జిల్లాలో ఇప్పటికి సాగైంది 21037 ఎకరాలు. ఇందులో 3569.42 ఎకరాల్లోని పంటకే రైతులు బీమా చేశారు. మిగతా వారు ఎందుకనో ఆసక్తి చూపడం లేదు. ఎల్‌నినో నేపథ్యంలో పంటలు ఎండిపోయినా.. బీమా చేస్తే దీమాగా ఉంటుందని అధికారులు చెబుతున్నా, చూద్దాం లే.. అంటూ సరిపెట్టేస్తున్నారు.

Farmers: పంటల బీమాపై  ఆసక్తి చూపని రైతులు
బంగారుపాళ్యం మండలం తిమ్మోజుపల్లిలో ఈ-క్రాప్‌ నమోదు చేస్తున్న ఏవో భారతి

చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి: పంటల బీమా చేసుకోడానికి గడువు శుక్రవారంతో ముగియనుంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటకే సాగు చేసిన పంటలకు బీమా చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేశాయి. వాతావరణ ఆధారిత పంటలైన వేరుశనగ, టమాటాకు గడువు ఈనెల 24కు ముగిసినా, రైతుల సౌలభ్యం కోసం 31వ తేది వరకు పొడిగించారు. అయినా ప్రయోజనం నామమాత్రంగానే ఉంది. తాము గతంలో పంట నష్టపోయినా బీమా సొమ్ము అందలేదని పలువురు రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే వాళ్లతా బీమా చేయించుకునేందుకు ముందుకు రాలేదని తెలిసింది. రైతుల్లోని ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసి, వారిని బీమా వైపు మొగ్గు చూపేలా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ఎల్‌నినో నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖల తరపున ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రైతులు పంటలకు బీమా చేసే దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిపై ఉంది. అలా బీమా చేయించి ఉంటే వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నా పరిహారం లభించి రైతులకు కొంత ఊరటైనా లభించి ఉండేది.

మిగిలింది ఒక్క రోజే

రైతులు సాగు చేసిన పంటలను బీమా చేసుకునేందుకే కేవలం ఒక్క రోజే మిగిలింది. రైతులు ఈ-క్రాప్‌ నమోదు చేసుకున్న వారికి మాత్రమే బీమా వర్తించనుంది. ఇప్పటి వరకు 21,037 ఎకరాల్లో పంటలు సాగవగా.. పది వేల ఎకరాలకు ఈ క్రాప్‌ నమోదు చేశారు. ఇందులోనూ 3569 ఎకరాల్లోని పంటలకే రైతులు బీమా చేసుకున్నారు. మిగిలిన రైతులు వెంటనే ఈ-క్రాప్‌ నమోదు చేసుకుని బీమా చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికి మిగిలింది ఒక్క రోజే. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, కౌలు రైతులైతే సీసీఆర్‌సీ పత్రం, రైతు సేవా కేంద్రం నందు పనిచేసే వ్యవసాయ సిబ్బంది జారీ చేసే పంట సాగు ధ్రువీకరణ పత్రం, రైతు డిక్లరేషన్‌, మొబైల్‌ నంబరు, రైతు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా అకౌంట్స్‌ మొదటి పేజీ కాపీ. మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, రైతు సేవా కేంద్రం, కామన్‌ సర్వీసు సెంటర్‌ (సీఎస్సీ), నేషనల్‌ క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ పోర్టల్‌, పీఏసీఎస్‌ ప్రీమియం చెల్లించొచ్చు.


బీమా చేసింది 3569.42 ఎకరాల్లోనే..

ఇప్పటికి 21,037 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తే.. అందులో 3569.42 ఎకరాల్లో (16.96 శాతం)ని పంటలకు 5965 మంది రైతులు బీమా చేశారు. ప్రీమియం కింద రూ.26.03 లక్షలు చెల్లించారు. (బీమా మొత్తం విలువ రూ.10.16 కోట్లు). ఇందులో వాతావరణ ఆధారిత పంటల బీమా కింద (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) 5724 మంది రైతులు 3438.77 ఎకరాల్లోని వేరుశనగ, టమాట పంటలకు రూ.25.30 లక్షల ప్రీమియం చెల్లించారు. దీని బీమా మొత్తం విలువ రూ.9.77 కోట్లు. ఇక, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎ్‌ఫబీవై) కింద 241 మంది రైతులు 130.65 ఎకరాల్లో సాగు చేసిన కంది, రాగి పంటలకు ప్రీమియం కింద రూ.73,138 చెల్లించారు. దీని బీమా మొత్తం విలువ రూ.39.73 లక్షలు.

సాగైంది 19 శాతమే

ఖరీఫ్‌ సీజన్‌లో సాధారణంగా దాదాపు 30 రకాల పంటలు 1,10,670 ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది జూలై 30 నాటికి 21,037 ఎకరాల్లో (19 శాతం) వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 37,337 ఎకరాల్లో (33.73 శాతం) పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పటికి సాగైన పంటలిలా

వరి 3022.5 ఎకరాల్లో సాగైంది. ఇక జొన్న 25, సజ్జలు 457.5, మొక్కజొన్న 565, రాగి 475, కందులు 202.5, పచ్చిమిరప 5, మినుములు 7.5, పశుగ్రాసం 22.5, అనుములు 32.5, వేరుశనగ 5472.5, సోయాబీన్స్‌ 172.5, చెరకు 10577.5 ఎకరాలుగా ఉన్నాయి.

Updated Date - Jul 31 , 2026 | 02:04 AM