Fake: నకిలీ కేటుగాళ్లు..!
ABN , Publish Date - May 19 , 2026 | 12:49 AM
నకిలీ కేటుగాళ్లు చెలరేగిపోయారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేశారు.
రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గంగవరం పోలీసులు
గంగవరం, మే 18 (ఆంధ్రజ్యోతి): నకిలీ కేటుగాళ్లు చెలరేగిపోయారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేశారు. చివరకు బయటపడటంతో గంగవరం రెవెన్యూ అధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గంగవరం రెవెన్యూ సర్వే నెంబరు 244/1లో (జాతీయ రహదారి పక్కన) 1.11 ఎకరాల స్థలం మంజునాథ్‌రెడ్డి పేరిట ఉంది. ఈ భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్ జరగడం లేదు. నిషేధిత జాబితా నుంచి తొలగించి.. ఈ భూమిని అమ్ముకోవడానికి మంజునాథ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం కొంతమంది దళారుల వద్దకు వెళ్లింది. తాము కలెక్టరేట్‌కు వెళ్లి నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించేలా ప్రొసీడింగ్స్ తీసుకొస్తామని.. తమకు అక్కడ పరిచయస్తులున్నారని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు రూ.5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీకి చెందిన కొందరు, దళారులు, కొంతమంది రెవెన్యూ సిబ్బందితో కలిసి నకిలీ ప్రొసీడింగ్స్‌కు స్కెచ్ వేశారు. అదెలాగంటే.. ఓ ప్రొసీడింగ్స్ కాపీ తీసుకొని, అందులోని సర్వే నెంబర్లు, తేదీలు మార్చారు. మంజునాథ్‌రెడ్డి పేరిట ఉన్న నిషేధిత భూమిని ప్రత్యేక ప్రొసీడింగ్స్‌తో తొలగించేసినట్లు ‘ఆర్.డీఐఎ్‌స.ల్యాండ్8/457099/2024 తేది /03/2024’ అని సర్వే నెం. 244/1 , 244/2 లలో ఉన్న భూమిని నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీచేసినట్లు నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేశారు. ఇంతటితో ఆగకుండా 2024 మార్చి 12వ తేదీన జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీచేసినట్లు.. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ నకిలీ ప్రొసీడింగ్స్‌ను తీసుకొని పలమనేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి తమ భూమిని తొలగిస్తున్నట్లు కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారని అధికారులకు చూపారు. ఈ ప్రొసీడింగ్స్‌లో తేదీ లేకపోవడం, కలెక్టర్ సంతకాలు 2024లో ఉన్నట్లు గుర్తించి వీరికి అనుమానం వచ్చింది. ఆ ప్రొసీడింగ్స్‌ను జిల్లా రిజిస్ర్టారు కార్యాలయానికి పంపించారు.
నకిలీ బాగోతం బయట పడిందిలా
జిల్లా రిజిస్ట్రారు కార్యాలయ అధికారులు ఈ ప్రొసీడింగ్స్‌ను పరిశీలించారు. దీనిపై తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంపై కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రొసీడింగ్స్‌ను పరిశీలించిన కలెక్టర్.. అందులోని కలెక్టర్ సంతకం ఫోర్జరీ అని గుర్తించారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గంగవరం రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఫోర్జరీ సంతకాలపై కేసు నమోదు
కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. నకిలీ ప్రొసీడింగ్స్‌తోపాటు పలు సాక్ష్యాలతో మండల రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు 318(4), 336(3), 340(2), 62(2), 212 బీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ప్రొసీడింగ్స్‌లో సంతకాలు ఫోర్జరీ అని ఫిర్యాదు అందిందని, దీనిపై కలెక్టరేట్‌కు నివేదికలు పంపి ఫోర్జరీపై లిఖితపూర్వకంగా అందజేయాలని కోరామని సీఐ రాంభూపాల్ తెలిపారు.