Elephants: పంటలపై ఆగని ఏనుగుల దాడులు
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:21 AM
పంటలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఒంటరి ఏనుగు మామిడి, కొబ్బరి చెట్లను విరిచేసింది. సోమల మండలంలో జంట ఏనుగులతోపాటు ఒంటరి ఏనుగు కలిసి వరినార్లు, మామిడి, అరటి తోటలను నాశనం చేశాయి.
కల్లూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం పాళెం పంచాయతీలో శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని ఎగువచలం నుంచి బయల్దేరిన ఈ ఒంటరి ఏనుగు కోటపల్లె వద్దకు చేరుకుంది. అక్కడది చేసిన ఘీంకారాలతో ఉలిక్కి పడ్డ జనం మిద్దెల పైకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది కోటపల్లె వద్దకు చేరుకుని గ్రామస్తులను అప్రమత్తం చేశారు. వెంకట్రామయ్య, దామోదర్, వీరభద్ర, మునిరత్నంకు చెందిన మామిడి, కొబ్బరి చెట్లను విరిచేసింది. అటవీ సిబ్బంది టపాకాయలు పేల్చడంతో జూపల్లె వద్దకు చేరుకుంది. సుబ్బరత్న, కళావతి, ఉదయ్‌కుమార్‌కు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేసింది. తర్వాత పాళెం మీదుగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ మామిడి తోటపై పడి చెట్లను విరిచేసింది. అనంతరం సమీపంలోని అడవిలోకి చేరుకుంది. శనివారం పగలంతా అడవిలోకి సూరప్పచెరువు వద్ద ఒంటరి ఏనుగు సంచరించింది. ధ్వంసమైన పంటలను అటవీ సిబ్బంది పరిశీలించారు. బాధిత రైతులు నష్ట పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాంపల్లె బీట్ బోడిబండ వద్ద మకాం
సోమల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సోమల మండలంలో జంట ఏనుగుల సంచారంతో జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పగలే రాంపల్లె బీట్ బోడిబండ వద్ద రెండు ఏనుగులు అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు పశువుల కాపర్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఆవులపల్లెపంచాయతీలోని పట్రపల్లె సమీప అటవీ శివార్లలో వరినార్లు, మామి డి, టమోటా తోటల్లో స్వైరవిహారం చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. రెండ్రోజులుగా బోనమంద, దుర్గం కొండ సమీపంలోని మణ్యం ప్రాంతం లో సంచరిస్తున్న ఏనుగులు కోతలు చేస్తున్న టమోటాతోటల్లో ఏనుగులు తిరగాడాయి. కాగా, చిన్నఉప్పరపల్లె పంచాయతీ ఇర్లపల్లె సమీప చెరువుకోన వద్ద ఒంటరి ఏనుగు వరినార్లు ధ్వంసంచేసినట్లు రైతులు తెలిపారు.