Tomato: టమోటా ధరల పతనం
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:37 AM
పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు బులియన్ మార్కెట్‌ను తలపిస్తోంది. ఆదివారం స్వల్పంగా పెరిగి రూ.220కి చేరింది.
పలమనేరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు బులియన్ మార్కెట్‌ను తలపిస్తోంది. వారం కిందట 15 కిలోల బాక్సు రూ.300 నుంచి రూ.350 వరకు పెరిగి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 19వ తేదికి రూ.200.. 20వ తేదికి రూ.150- రూ.170కి పడిపోయింది. ఆదివారం స్వల్పంగా పెరిగి రూ.220కి చేరింది. దీంతో టమోటా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా ఒక్కసారిగా తోటల్లో టమోటాలు మాగిపోయి పెద్ద ఎత్తున మార్కెట్‌కు తరలుతుండడంతో ధరలు పతనమైపోతున్నట్లు తెలుస్తోంది. వర్షాలకు మాగిన టమోటాలు సుదూర ప్రాంతాలకు తరలించే క్రమంలో నలిగి పోతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడం కూడా మరోకారణం. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం నంగిలిలో ఆదివారం టమోటా బాక్సు రూ.300, మదనపల్లెలో బాక్సుకు రూ.50 అధికంగా పలికిందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. పలమనేరు మార్కెట్‌లో మండీవ్యాపారులు, మార్కెట్ సమస్యలపై టమోటా రైతులు ఆదివారం ఆందోళన చేశారు. దీంతో వెంటనే స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న రైతులతో భేటీ అయ్యారు. ప్రతి మండీలో టమోటా ధరలు తెలిపే డిజిటల్ బోర్డు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని, మార్కెట్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని డిమాండు చేశారు. రైతుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని రాజన్న హామీ ఇచ్చారు.