Share News

Task force: టాస్క్‌ఫోర్స్‌లో కొందరి తీరుపై అనుమానాలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 02:04 AM

ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Task force: టాస్క్‌ఫోర్స్‌లో కొందరి తీరుపై అనుమానాలు
ఎర్రచందనం

ఇంటి దొంగలే ఉప్పందిస్తున్నారా ?

తిరుపతి (కపిలతీర్థం), మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. వారే స్మగ్లర్లకు ముందస్తు సమాచారం చేరవేస్తున్నారని భావిస్తున్నారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2012లో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసింది. 2015లో పూర్తిస్థాయిలో పటిష్టపరిచింది. ఎస్పీ, ఏఎస్పీ, సీఐలు, ఆర్‌ఎ్‌సఐ, ఎస్‌ఐలు, 300మందికి పైగా సిబ్బందిని నియమించింది. సోలార్‌ కెమెరాలు, ట్రాప్‌ కెమెరాలు, శాటిలైట్‌ ఫోన్లు, నైట్‌ బైనాక్యులర్‌ వంటి ఆధునిక సామగ్రినీ సమకూర్చింది.

వేటాడుతున్నా ఆగని అక్రమ రవాణా

టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో తరచూ కూంబింగ్‌ జరుగుతోంది. అడపాదడపా ఎర్రచంద్రనం దుంగలనూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఈఏడాది జనవరిలోనే 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని ఆరెస్టుచేశారు. అంతర్జాతీయ స్మగ్లర్‌గా పేరొందిన మహ్మద్‌ను పట్టుకోగలిగారు. భాకరాపేట అటవీశాఖ అధికారులు కూడా 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్టులు పెడుతున్నా ఎర్రచందనం అక్రమ రవాణాఆగడంలేదు. పలువురు స్మగ్లర్లు ఇప్పటికీ శేషాచల కొండల్లో తిష్టవేసి ఉండడం ఉన్నతాధికారులను విస్మయపరుస్తోంది. ఈక్రమంలోనే వారి వెనుక ఇంటి దొంగల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టాస్క్‌ఫోర్సు విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన సత్తిరాజు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. నిఘాపెట్టి ఆధారాలు సేకరించాకే అతడ్ని పట్టకోగలిగారు. అటవీశాఖలో పనిచేస్తూ స్మగ్లర్లకు సహకరించిన కొందరు అధికారులు సస్పెండైన వైనాలు గతంలో వున్నాయి.


ఇంట గెలవలేకపోతున్నారా...

ఒకపుడు ఎర్రచందనాన్ని తరలించే మార్గంలో తనిఖీల గురించి ముందుగా తెలుసుకోడానికి స్మగ్లర్లు కొందరిని పైలెట్లుగా పంపేవారు. వారిచ్చే సమాచారంతో జాగ్రత్తపడేవారు. అయినా పట్టుబడుతూ ఉండటంతో ఎర్రదొంగలు తమ ఎత్తుగడ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం అవినీతిపరులైన సిబ్బందిని గుర్తిస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఎర చూపి వారిని ఇన్‌ఫార్మర్లుగా మార్చుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేకులు పడటంలేదని భావిస్తున్నారు. అటవీశాఖ, టాస్క్‌ఫోర్సులో వివిధ విభాగాల్లో కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న వారిపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. వారి అక్రమ సంపాదన ఏస్థాయిలో ఉందో గుర్తించాల్సిన అవసరముందంటున్నారు. రిటైరైనా స్మగ్లర్లకు సహకరిస్తున్న వారెవరైనా ఉన్నారా లాంటి అంశాలపైనే ఫోకస్‌ పెట్టి ఇంటి దొంగలను కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Mar 21 , 2026 | 02:04 AM