Share News

Document writers': డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:54 AM

డాక్యు మెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌ ఆందోళన తొలి రోజు రిజిస్ట్రేషన్‌ శాఖపై పరిమిత ప్రభావమే చూపింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ, అధికవిలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు.

Document writers': డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌
చంద్రగిరిలో డాక్యుమెంట్‌ రైటర్ల ఆందోళన

తిరుపతి సిటీ, జూలై 20(ఆంధ్రజ్యోతి): డాక్యు మెంట్‌ రైటర్ల పెన్‌డౌన్‌ ఆందోళన తొలి రోజు రిజిస్ట్రేషన్‌ శాఖపై పరిమిత ప్రభావమే చూపింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ, అధికవిలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు. సాధారణ రోజుల్లో జిల్లావ్యాప్తంగా రెండు వందలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిద్వారా రిజిస్ట్రే షన్‌ శాఖకు సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తుంది.సోమవారం కూడా దాదాపు రూ.90 లక్షల ఆదాయం వచ్చిందని, డాక్యుమెంట్లు మాత్రం సుమారు 60 మాత్రమే జరిగాయని జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీరామ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం పరిస్థితిని చూసి అసలు ప్రభావాన్ని అంచనా వేయడం కష్ట మేనని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సెంటిమెంట్‌ కారణంగా చాలా మంది కొత్త ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ముందుకురారు. దీంతో ఆ రోజు సాధా రణంగానే రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే బుధవారం కూడా డాక్యుమెంట్‌ రైటర్ల పెన్‌ డౌన్‌ కొనసాగితే మాత్రం పరిస్థితి మారే అవకాశం ఉంది. పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్లువాయిదా పడడంతో కొనుగోలుదారులు, విక్రేతలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిఏర్పడుతుంది. ముందస్తుగా స్లాట్లు బుక్‌చే సుకున్నవారు, బ్యాంకు రుణాల గడువులతో ఉన్న వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అదే సమ యంలో ప్రభుత్వానికి వచ్చేస్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఆదాయంపైనా ప్రభావం పడేఅవకాశం లేకపోలేదు.


మాకు భద్రత కల్పించండి :డాక్యుమెంట్‌ రైటర్లు

పారదర్శకత, వేగవంతమైన రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్ల తయారీకి పీపీపీ పద్దతిలో ఆర్‌ఎస్కే సేవా కేంద్రాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్‌ రైటర్లు పది రోజు లపాటు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా డాక్యు మెంట్‌రైటర్లు షాపులను మూసివేశారు. తిరుపతితో పాటు పలు కేంద్రాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. తమ పాత లైసెన్సులను రెన్యువల్‌ చేసి, వృత్తికి భద్రత కల్పించాలని డిమాండు చేశారు. ప్రభుత్వ నిర్ణయం వలన రాష్ట్రవ్యాప్తంగా లక్ష కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 21 , 2026 | 12:54 AM