Share News

Drought: కరువు కోరల్లో జిల్లా

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:44 AM

జిల్లాను కరువు ఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 24 మండలాలను తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Drought: కరువు కోరల్లో జిల్లా
కరువు ఛాయలు

చిత్తూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాను కరువు ఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 24 మండలాలను తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్నుంచి నాలుగింటిని మినహాయించింది. కాగా, జూన్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 424.3 మి.మీ కాగా.. కేవలం 197.6 మి.మీలు మాత్రమే నమోదైంది. ఈ మూడు నెలల్లో 53.4 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా కరువు ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. కాగా, అన్నమయ్యలో 25 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా.. ఈ కరువు జాబితాలో తిరుపతి జిల్లాకు చోటు దక్కలేదు. కాగా, కరువు మండలాలుగా ప్రకటించిన అనంతరం జిల్లా గెజిట్‌లో నిర్దిష్ట మండలాలను కలెక్టర్‌ నోటిఫై చేయాల్సి ఉంటుంది. కరువు మండలాల ప్రకటనతో రైతులకు పంట నష్టపరిహారం, పంట రుణాల రీషెడ్యూల్‌, వడ్డీ రాయితీ వంటి ఉపశమన చర్యలు అందే అవకాశం ఉంటుంది. తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ఉపాధి హామీ పనుల పెంపు, సాగునీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది.


కరువు ప్రభావిత మండలాలు

వెదురుకుప్పం, పెనుమూరు, జీడీనెల్లూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజాణి, గంగవరం, కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లె, యాదమరి, బంగారుపాళ్యం, చిత్తూరు అర్బన్‌, గుడిపాల, చిత్తూరు రూరల్‌, పులిచెర్ల, రొంపిచెర్ల.

జాబితాలో లేనివి

వర్షపాతం బాగా నమోదైన నిండ్ర, విజయపురం, నగరి, పాలసముద్రం మండలాల్ని కరువు ప్రాంతాల జాబితాలో చేర్చలేదు.

Updated Date - Oct 02 , 2026 | 01:45 AM