Share News

TTD: టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతి గదులు

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:00 AM

విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్‌ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది.

 TTD: టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతి గదులు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.118.89 కోట్ల ఖర్చు

తిరుపతి(టీటీడీ), మార్చి 9 (ఆంధ్రజ్యోతి): విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్‌ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది. తరగతి తగదులను ఆధునికీకరించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన వసతి, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు టీటీడీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఏమేం చేస్తారంటే..

టీటీడీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 31 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. టీటీడీ పాఠశాలలు, కళాశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లుగా మారుస్తారు. ఇందుకోసం ఆయా క్లాస్‌రూమ్‌లలో ఇంటర్‌యాక్టివ్‌ ప్యానల్‌ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం సుమారు 260 గదులు ఉన్నట్లుగా గుర్తించారు. ఒక్కో ప్యానల్‌ బోర్డు ఏర్పాటుకు సుమారు రూ.2లక్షలు ఖర్చవుతుందని, మొత్తంగా రూ. 5.20 కోట్లు అవసరమని అంచనా వేశారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల డేటా, అడ్మిషన్లు, అటెండెన్స్‌, ఫీజు, పరీక్షలు ఇలా అన్ని అంశాలను ఒకే దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడం/అవసరమైతే కొనుగోలు చేసేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా విద్యాసంస్థల్లో అవసరమైన కంప్యూటర్లను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో కొన్నింటిని దాతల ద్వారా అందించేందుకు టీటీడీ పాలకమండలి సభ్యురాలు పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు.


ఐఐటీ, నీట్‌లో కోచింగ్‌..

ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా టీటీడీ కళాశాలల్లోని వారు పోటీ పరీక్షల్లో రాణించేందుకు అనుగుణంగా వారికి శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే పాలకమండలి నిర్ణయించింది. ప్రధానంగా ఐఐటీ, నీట్‌, సీఏఏ, సీఎల్‌ఏటీతోపాటు ఇతర పరీక్షలకు తర్ఫీదు ఇవ్వనున్నారు. అలాగే ఒకేషనల్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను అవసరమైన మేరకు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థుల కోసం అత్యవసర వైద్య సేవలు అందించడానికి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ను (క్లినిక్‌ ఆన్‌ వీల్స్‌) అందుబాటులోకి తీసుకురానున్నారు. దాత ద్వారా ఏర్పాటు చేయడానికి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 02:01 AM