DMHO: దర్శన్‌ను పరీక్షించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:47 PM
నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ శ్వాస పీల్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి దర్శన్‌కు ‘ఊపిరి’ పోయడానికి జిల్లా యంత్రాంగం కదిలింది.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
శ్రీరంగరాజపురం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ శ్వాస పీల్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి దర్శన్‌కు ‘ఊపిరి’ పోయడానికి జిల్లా యంత్రాంగం కదిలింది. శ్రీరంగరాజపురం మండలం మెదవాడకు చెందిన అశ్విని, ప్రకాష్ దంపతుల కుమారుడు దర్శన్‌కి ఆరోగ్య సమస్యను ప్రస్తావిస్తూ శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ‘ఊపిరి’ పోయండి’ అంటూ ప్రచురితమైన కథనంపై కలెక్టర్ సుమిత్‌కుమార్ స్పందించారు. వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆ చిన్నారిని పరీక్షించి.. మెరుగైన వైద్య సేవలకు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనకు సమగ్ర నివేదికను అందించాలని డీఎంహెచ్‌వో సుధారాణిని ఆదేశించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జి.వెంకటప్రసాద్, ఆర్‌బీఎ్‌సకే పీవో డాక్టర్ సి.గిరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌ఎన్ బాలాజీ చరణ్, ఆరోగ్య సిబ్బంది మెదవాడకు చేరుకున్నారు. ఆ చిన్నారికి ఇప్పటి వరకు అందిన వైద్య సేవలు, ఇకపై అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. చిన్నారి వైద్య సేవలకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా కలెక్టర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు. అంతకు ముందు తహసీల్దార్ లోకనాథంపిళ్లై ఆ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు.