Share News

Clean Village: స్వచ్ఛ పల్లెకు పోటీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:50 AM

గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు -2026 పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టింది.

Clean Village: స్వచ్ఛ పల్లెకు పోటీ

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, సంపద సృష్టికి ప్రాధాన్యమిచ్చాయి. స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయినా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛతలో గ్రామపంచాయతీల మధ్య పోటీ పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు -2026 పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టింది.

పారిశుధ్య కార్మికులకూ అవకాశం

గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా పారిశుధ్య కార్మికులకు (స్వచ్ఛ దూతలు) కూడా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వీరికి రాష్ట్ర స్థాయిలో మూడు, జిల్లాస్థాయిలో ఐదు అవార్డులు ఇవ్వనున్నారు. విధుల్లో శ్రద్ధ, ఇంటింటా చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఆదర్శ పద్ధతులు, వ్యర్థాల విభజనపై ప్రజలకు అవగాహన కల్పించడం, బాధ్యతగా పనిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనికోసం కార్మికులు ఆనల్‌లైన్‌లో తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి అధికారులు వారి పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదర్శ కార్మికులను ఎంపిక చేస్తారు.

నిర్వహణే ప్రామాణికంగా..

స్వచ్ఛ కార్యక్రమాల సమర్థ నిర్వహణను ప్రధాన అంశంగా తీసుకుని పోటీలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 622 పంచాయతీల మధ్య ఈ పోటీ ఉండనుంది. ఇప్పటికే మండల, గ్రామస్థాయి అధికారులకు మార్గదర్శకాలు అందాయి. రెండు విభాగాల్లో పోటీలు ఉండనున్నాయి. ఇంటింటా చెత్తసేకరణకు 30 మార్కులు, తడి, పొడి చెత్త సేకరణకు 25, ఘన వ్యర్ధాల నిర్వహణకు 20, పరిసరాల శుభ్రతకు 15, గృహ కంపోస్టింగ్‌, కిచెన్‌ గార్డెన్‌లకు 10 మార్కుల వంతున కేటాయించారు.


అంశాలు ఇవీ

స్వచ్ఛ పంచాయతీల విభాగంలో రాష్ట్రస్థాయిలో ఆరు, జిల్లా స్థాయిలో ఐదు అవార్డులు ఇవ్వనున్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధుల శుభ్రత, ఇంటింటా చెత్త సేకరణ, సేంద్రియ వ్యర్థాల నిర్వహణ, తోటల పెంపకం, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

అవార్డుల సాధనకు కృషి చేయాలి : సుధాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి

స్వచ్ఛాంధ్ర- 2025లో జరిగిన పోటీల్లో చిత్తూరుకు ఒక రాష్ట్ర, ఐదు జిల్లా అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అన్ని పంచాయతీల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డులు సాధించేందుకు కృషి చేయాలి. పంచాయతీరాజ్‌ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన లింకులో ఆయా పంచాయతీ అధికారులు వివరాల నమోదు ప్రక్రియను గురువారంలోగా పూర్తి చేస్తారు. ఎంపీడీవోలు వాటిని పరిశీలించి వారి లాగిన్‌లో అప్రూవల్‌ చేస్తారు. అధికారులందరూ ఆయా గ్రామపంచాయతీలను సందర్శించి ఈనెల 27వ తేదీ ఎంపికయ్యే పంచాయతీల జాబితాలను నివేదిస్తారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఎంపికైన పంచాయతీలకు ఉత్తమ రాష్ట్ర, జిల్లా అవార్డులను అందిస్తారు.

Updated Date - Sep 11 , 2026 | 01:50 AM