Share News

Tiruchanur: తిరుచానూరు ఆలయంలో దళారులకు చెక్‌

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:28 AM

తిరుచానూ రులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇటీవల కాలంలో దళారుల బెడద పెరిగిపోవడం టీటీడీకి తలనొప్పిగా మారింది. దీన్ని అడ్డుకోవడానికి తిరుమల తరహాలో కుంకుమార్చనతోపాటు అన్ని సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Tiruchanur: తిరుచానూరు ఆలయంలో దళారులకు చెక్‌
తిరుచానూ రులోని పద్మావతి అమ్మవారి ఆలయం

తిరుచానూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుచానూ రులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇటీవల కాలంలో దళారుల బెడద పెరిగిపోవడం టీటీడీకి తలనొప్పిగా మారింది. దీన్ని అడ్డుకోవడానికి తిరుమల తరహాలో కుంకుమార్చనతోపాటు అన్ని సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా శుక్రవారం మధ్యాహ్నం కుంకుమార్చన టిక్కెట్‌కు భక్తుల నుంచి ఆధార్‌కార్డును స్వీకరించి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. విజయవంతం కావడంతో ఇకపై సుపథం టిక్కెట్‌ (రూ.200)తోపాటు ప్రతి సేవకూ ఆధార్‌ను అనుసంధానం చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒక టిక్కెట్టు మాత్రమే ఇవ్వనున్నారు. ఎంతమంది వస్తే అంతమంది భక్తులు వారే టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టిక్కెటు పొందిన భక్తులు ఆలయంలోకి వెళ్లగానే టిక్కెట్‌ను చించి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే ఆ టిక్కెట్‌పై అతడే వస్తున్నాడా.. వేరే వ్యక్తా అన్నది స్పష్టంగా తెలిసేది కాదు. దాంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ఈ క్రమంలో తిరుమల తరహాలోనే టిక్కెట్‌ స్కానింగ్‌ సిస్టం తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఆలయంలోని కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేశారు. మరో వారంరోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 31 , 2026 | 02:28 AM