Share News

Birds Festival: అట్టహాసంగా పక్షుల పండుగ

ABN , Publish Date - Jan 11 , 2026 | 02:40 AM

మూడు రోజులపాటు నిర్వహించే పక్షుల పండుగ శనివారం సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది.

Birds Festival: అట్టహాసంగా పక్షుల పండుగ
నేలపట్టులో చెట్లపై విదేశీ విహంగాలు - పులికాట్‌లో పడవ షికారు - వర్షం కురుస్తుండటంతో కుర్చీలను తలపై పెట్టుకొని ఆటలపోటీలను తిలకిస్తున్న జనం

పడవ షికారుకు, పక్షుల వీక్షణకు ఎగబడ్డ జనం

తడ/సూళ్లూరుపేట, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులపాటు నిర్వహించే పక్షుల పండుగ శనివారం సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం జరిగిన శోభాయాత్రను సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ జెండా ఊపి ప్రారంభించారు. హోలిక్రాస్‌ సర్కిల్‌ నుంచి కళాశాల మైదానం వరకు సాగిన ర్యాలీలో డప్పు కళాకారుల వాయిద్యాలు, పంబలోళ్ల విన్యాసాలు, కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణల కళాకారులు శోభాయాత్ర వెంట నడిచారు. కళాశాల మైదానం వద్దకు చేరుకోగానే రిబ్బన్‌ కట్‌చేసి బెలూన్లను ఎగురవేసి పక్షుల పండుగను ప్రారంభించారు. పశుసంవర్ధక స్టాల్‌ వద్ద గోపూజ చేసి స్టాల్స్‌ను ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రీడలు ఆడారు. భీములవారిపాళెం పడవలరేవులో ట్రైనీ కలెక్టర్‌ రఘువంశీ పడవ షికారును.. నేలపట్టులో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, అటకానితిప్పలో అటవీ అధికారులు, శ్రీసిటీలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆయా కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటి రోజు పడవ షికారు, పక్షుల వీక్షణకు జనం ఆసక్తి చూపారు. అధికారులు 30 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు చలిగాలులు వీచాయి. అలలు కొంత ఉధ్రుతంగా ఉన్నా పడవ షికారుకు ఆటంకం కలగలేదు. ఆ తర్వాత వర్షం మొదలై సాయంత్రం 5 గంటల వరకు మోస్తరుగా కురవడంతో పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. వర్షం పడటంతో సభా ప్రాంగణం ఖాళీ అయింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో జనం పలచగా ఉన్నారు. ఆ తర్వాత చేరారు. పండుగ జరిగే ప్రాంతాలలో స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి డాక్టర్‌ పరసారత్నం, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీమంత్‌రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్‌, మత్స్యశాఖ జేడీ శాంతి, జిల్లా సంక్షేమశాఖ అధికారి విక్రమ్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మన శ్రీధర్‌, ఏఎంసీ చైర్మన్లు ఆకుతోట రమేష్‌, ఉయ్యాల ప్రవీణ్‌, టీడీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, పార్థసారధి, సెల్వం, శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు.

పక్షుల వీక్షణకు తరలి వచ్చి..

దొరవారిసత్రం, ఆంధ్రజ్యోతి: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలోని మంచి నీటి చెరువుల్లో కడప చెట్లపై విడిదిలో ఉన్న పక్షుల విహంగాలను వీక్షించేందుకు సందర్శకులు బారులు తీరారు. పక్షుల పండుగకు అధికార యంత్రాంగం పెద్దగా ప్రచారం కల్పించలేకపోయినా సందర్శకులు వేల సంఖ్యలో విచ్చేశారు. మధ్యాహ్నం నుంచి సందర్శకుల సంఖ్య పెరిగింది. సందర్శకుల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ, చెరువు కట్టలపై తొక్కిసలాట వంటివి జరగకుండా చూడాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అధికారులకు ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.


తొలిసారి ప్రముఖులు లేకుండానే..

పక్షుల పండుగ ప్రారంభమంటే కనీసం ముగ్గురు, నలుగురు మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులందరూ వచ్చేవారు. దీనికోసం వారం ముందే వారికి ఆహ్వాన పత్రికలు ఇచ్చేవారు. ఈ సారి జిల్లాలోని ఎందరో ప్రజాప్రతినిధులు, స్థానిక అధికార పార్టీ నాయకులకూ ఆహ్వానాలు ఇవ్వలేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్‌ పక్షుల పండుగ ప్రారంభించారు. ఇలా ముఖ్యులు లేకుండా ప్రారంభమైన తొలి పక్షుల పండుగ ఇదేనని చెబుతున్నారు.

బీవీపాలెం వద్ద పులికాట్‌ సరస్సులో రెండు కిలోమీటర్ల పరిధిలో షికారుకు 35 బోట్లు, ఇరకం దీవికి 10 బోట్లు, ఐదు తెరచాపలు ఏర్పాటు చేశారు. ఒక్కో బోటులో 15 మందిని అనుమతించారు. ఫ చిత్తడి నేలల పరిరక్షణ, సుస్థిర పర్యాటకం అంశంపై వినూత్న ఆలోచనలు రేకెత్తించేలా శ్రీసిటీలో సదస్సు నిర్వహించారు.

నేటి కార్యక్రమాలు

ఉదయం 10-1 గంటలు: స్టాల్స్‌ సందర్శన

సాయంత్రం 5- 6.15: స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన

6.15 నుంచి 7 గంటల వరకు ముఖ్య అతిథుల ప్రసంగాలు

మోహన్‌బోగరాజు, హారికా నారాయణ, సాకే్‌షల పాటకచ్చేరి. ముఖ్య అతిథులుగా సినీ నటులు డింపుల్‌హయత్‌, హాసిని రంగనాథులు పాల్గొననున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 02:40 AM