Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:05 AM
వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ‘వడదెబ్బ అంటే.. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత (104.9 డిగ్రీల ఫారెన్హీట్) పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే గ్రంధి హైపోతాలమస్ దెబ్బతింటుంది. వడదెబ్బ సోకిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించాలి. అనంతరం సమీపంలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏహెచ్‌డీహెచ్‌కు తరలించి వైద్యం అందించాలి. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి’ అని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ గిరి, శ్రీవాణి, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.
సుర్రుమంటున్న సూరీడు
ఒకవైపు సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. దీతో మధ్యాహ్నం వేళ ఎక్కువమంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరగడంతో కరెంటు వినియోగమూ అధికమవుతోంది. ఇక, గురువారం అత్యధికంగా నిండ్ర మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమదైంది. మండలాల వారీగా.. తవణంపల్లెలో 38.8, శ్రీరంగరాజపురంలో 38.3, నగరిలో 37.5, గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్‌లో 37.1, గంగవరంలో 37.0, బంగారుపాళ్యంలో 36.8, విజయపురంలో 36.4, ఐరాల, పెనుమూరు, రామకుప్పం, యాదమరిలో 36.3, రొంపిచెర్లలో 36.1, పెద్దపంజాణిలో 35.9, పులిచెర్ల, వెదురుకుప్పంలలో 35.7, గంగాధర నెల్లూరులో 35.5, గుడుపల్లె, కుప్పం, శాంతిపురంలో 35.1, పలమనేరులో 34.3, కార్వేటినగరం, పూతలపట్టులో 33.9, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రేషన్‌సరుకుల పంపిణీ వేళల మార్పు
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రేషన్ పంపిణీ వేళల్లో మార్పులు చేశారు. దుకాణాలకు వచ్చే కార్డుదారులు వడదెబ్బకు గురవ్వకుండా డీలర్లు మార్గదర్శకాలు పాటించాలని జిల్లా పౌరసరఫరాల విభాగం ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బదులుగా.. ఇక 7 నుంచి 11 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలి.
దుకాణాల వద్ద మంచినీటి వసతి కల్పించాలి.
అవసరం మేరకు షామియానా, టెంట్ వేసి నీడ కల్పించాలి.
క్యూ విధానం పాటింపజేయాలి.
మహిళలు, వృద్ధులకు ముందుగా సరుకులు ఇవ్వాలి.
ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలి
వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి.