Share News

Farmers: ఏపీఏఐఎంఎస్‌ 2.0

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:33 AM

సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ 2.0 (ఏపీఏఐఎంఎస్‌)’ వ్యవసాయరంగంలో సమాచార విప్లవం సృష్టిస్తోంది. గతంలోనూ ఈ విధానం ఒకటి ఉన్నా, అనేక పరిమితులతో రైతుకు అంతగా ఉపయోగం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం పలురకాల సాంకేతిక పద్ధతులను ఉపయోగించి, మరిన్ని డిజిటల్‌ సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తెచ్చి ఏపీఏఐఎంఎస్‌ 2.0 అనే కొత్త వెర్షన్‌ రూపొందించింది. ఇది రైతులకు అపార ప్రయోజనం చేకూరుస్తోంది.

Farmers: ఏపీఏఐఎంఎస్‌ 2.0
కృష్ణదాసనపల్లెలో ఇ-పంట నమోదు- కుప్పం వ్యవసాయ శాఖ కార్యాలయంలో పేరు ఆన్‌లైన రిజిస్టర్‌ చేసుకుంటున్న రైతు

కుప్పం, ఆంధ్రజ్యోతి: రైతులు, పంటల సాగు, వ్యవసాయ పథకాలు, అధికారులు, వ్యవసాయ సేవల సమగ్ర సమాచారాన్ని నిర్వహించడం ఏపీఏఐఎంఎస్‌ 2.0 ప్రధాన ఉద్దేశం. ఇ-క్రాప్‌ బుకింగ్‌, ఆర్‌ఎ్‌సకే (రైతు సేవా కేంద్రం) ద్వారా ఏపీఏఐఎంఎస్‌ వ్యవస్థ సమర్థంగా పనిచేయగలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఏపీఎ్‌ఫఆర్‌)లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఏడాదిగా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా, రైతుల్లో స్పందన తక్కువగా ఉంటోంది. కుప్పం నియోజవకవర్గంలో ఇప్పటికి కేవలం 77 శాతం మందే నమోదు చేసుకున్నారు. గత వారం నాటికి కుప్పం మండలంలో 8029 మందికి 5017 మంది, గుడుపల్లెలో 4,990కి 4103, శాంతిపురంలో 5967కి 4626, రామకుప్పం మండలంలో 6751 మందికిగాను 5017 మంది రైతులు రిజిస్టర్‌ అయ్యారు.

ఇవీ ప్రయోజనాలు

వివిధ పంటలు వేయాల్సిన సమయం, పంట సాగుకు సంబంధించిన సూచనలు, సలహాలు రైతుకు లభిస్తాయి. సాగు చేసిన పంటల రకం, ప్రాంతం, సాగు విస్తీర్ణం వంటి సమాచారం ఆధారంగా వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన ప్రభుత్వానికి సులువవుతుంది. పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులను చిత్రాల ఆధారంగా విశ్లేషించి, వాటికి తగిన పరిష్కారాలను అధికారులు సూచిస్తారు. ఇక, నీటి కొరత, అవసరం వంటివీ అధికారులు అంచనా వేయవచ్చు. వాతావరణ హెచ్చరికలు జారీ చేయవచ్చు. ప్రభుత్వ పథకాలను డిజిటల్‌ విధానంలో నిర్వహించి, ఎవరి సాయం లేకుండా నేరుగా రైతులకు లబ్ధి చేకూర్చే వీలు చిక్కుతుంది. ఎక్కడ ఏ పంటకు మార్కెటింగ్‌ ఉందో, ఏ పంట వేస్తే మార్కెట్టు లభిస్తుందన్న సమాచారమూ ఇవ్వొచ్చు.


డేటా నమోదు ఇలా

రైతులు, పంటలు, వ్యవసాయ యంత్రాలు వంటి క్షేత్రస్థాయి సమాచారాన్ని గ్రామస్థాయిలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు (ఏఏ) సేకరించి యాప్‌లో నమోదు చేస్తారు. రైతు సేవలు, ఎరువుల పంపిణీ తదితర సమాచారంలో రైతు సేవా కేంద్రాలు ఏపీఏఐఎంఎస్‌ 2.0తో అనుసంధానమై పనిచేస్తాయి. సాధారణంగా ఇ-క్రాప్‌, ఏపీఎ్‌ఫఆర్‌ల ద్వారా నమోదైన సమాచారమే ఏపీఐఎంఎస్‌ యాప్‌లోనూ ఉంటుంది. దీంతో ఒకే డిజిటల్‌ వేదికపై అందుబాటులోకి వచ్చిన వివరాల ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు, రైతులకు పైన పేర్కొన్న ప్రయోజనాలు చేకూరుతాయి. రైతులందరూ ఆయా డిజిటల్‌ వేదికల్లో తమ పేర్లతోపాటు, భూమి, సాగు వివరాలను నమోదు చేసుకోవాలి. తద్వారా ఒక రైతుకు సాగు విస్తీర్ణం బట్టి ఏడాదికి ప్రభుత్వం కేటాయించిన ఎరువులను మండలంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ దుకాణంలోనైనా సబ్సిడీ మీద తీసుకోవచ్చు. అలాగే నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)లో ఈకేవైసీ చేసుకుంటే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున చేసే ఆర్థిక సాయం నాలుగు విడతలుగా వారి అకౌంట్లలో నేరుగా జమవుతుంది.

ఎక్కడైనా సబ్సిడీపై ఎరువులు తీసుకోవచ్చు :- కె.రామమూర్తి, రైతు, గుల్లేపల్లి, కుప్పం మండలం

నా పేరును అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకున్నా. నాకు ఒక నెంబర్‌ ఇచ్చినారు. దీనిని చూపించి ఇప్పుడు ఏ ఎరువుల అంగడిలోనైనా ప్రభుత్వం నాకు సబ్సిడీమీద ఇచ్చే ఎరువులు తీసుకోగలుగుతున్నా. గతంలో అధికారులు చెప్పిన అంగిట్లోనే ఎరువులు కొనాల్సి వచ్చేది. ఇది దూరాభారంతో పాటు క్యూలో నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇబ్బందులేవీ లేకుండా నాకు దగ్గిరిలోని అంగిట్లో ఎక్కడైనా సరే ఎరువులు ఇస్తావుండారు.

రైతులూ.. మీ పేర్లను రిజిస్టర్‌ చేసుకోండి : - ఫయాజ్‌ బాషా, కుప్పం మండల వ్యవసాయాధికారి

ఏపీఏఐఎంఎస్‌ 2.0లో రైతులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకుంటే ప్రత్యకమైన గుర్తింపు సంఖ్యను ప్రభుత్వం ఇస్తుంది. ఈ సంఖ్య ఉంటే.. ప్రభుత్వం ద్వారా అందే సకల ప్రయోజనాలూ ఏపీఏఐఎంఎస్‌ 2.0లో పొందుపరచిన డేటా ఆధారంగా రైతులకు నేరుగా లభిస్తాయి. రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవా సెంటర్లు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డుల ఒరిజినల్స్‌తో పాటు జెరాక్స్‌ కాపీలనూ రైతులు తీసుకు రావాలి.

Updated Date - Aug 21 , 2026 | 01:33 AM