VBG Ram G: ఇక.. వీబీ-జీ-రామ్-జీ
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:53 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. బుధవారం నుంచి ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ-రామ్-జీ)’గా మారింది.
రెండు వారాలకు ఒకసారి చెల్లింపులు
చిత్తూరు సెంట్రల్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. బుధవారం నుంచి ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ-రామ్-జీ)’గా మారింది. వలసలకు అడ్డుకట్ట వేస్తూ 2006లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణులకు పనులు కల్పిస్తూ తీసుకొచ్చిన ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి వీబీ-జీ-రామ్-జీ అమల్లోకి వస్తున్నా.. గురువారం తిరుపతి జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె పంచాయతీ మంగంపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పశ్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా, ప్రతి మండలంలోనూ ఒక పంచాయతీలో.. వీబీ-జీ-రామ్-జీ పథకాన్ని బుధవారం నుంచి అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)ద్వారా కొత్త పథకాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం డ్వామా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, ఇప్పటి వరకు కూలీలకు తప్పనిసరిగా వంద రోజుల ఉపాధి పనులు కల్పిస్తున్నారు. వీబీ-జీ-రామ్-జీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉండి ఉపాధి పనులకు వచ్చే ప్రతి కుటుంబానికి ఏటా 125 పనిదినాలు కల్పిస్తారు. రెండు వారాలకు ఒకసారి ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లిస్తారు. ఒకవేళ చెల్లింపుల్లో జాప్యం జరిగితే, ప్రత్యేక పరిహారం చెల్లిస్తారు. ఆరు నెలలకు ఒక సారి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయిలోని లోపాలు ఎప్పుటికప్పుడు సవరించడానికి కూలీల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, త్వరతగతిన పరిష్కారం చేపట్టనున్నారు.
వీబీ-జీ-రామ్-జీ పథకంలో చేపట్టే పనులు
పల్లెపండుగ 2.0(పశువుల కొట్టాలు), కంపోస్టు పిట్స్, అమృత్/మినీ అమృత్ సరోవర్లు, పశువులకు చెరువులు, పూడికతీత, పునరుద్ధరణ, చెక్‌డ్యాంల పూడికతీత, ఫీడర్లు, ఫీల్డ్ ఛానెళ్లు, తవ్విన చెరువులు, చేపల చెరువులు, పశుమేత అభివృద్ధి, ఇంకుడు కుంటలు, మేజిక్ కాలువలు, రీ బుష్ ప్లాంటేషన్, కొత్త చెక్ డ్యాంలు, ఫ్లాంటేషన్, నర్సరీలు, సీసీ రోడ్లు, అప్రోచ్ రోడ్లు, బీటీ రోడ్లు, ట్రెంచ్‌లు తదితర పనులు చేపట్టనున్నారు. ఈ పనులను చూస్తుంటే.. రైతులకు పాక్షికంగా మేలు చేసేలా ఉంది. నూతన సంస్కరణలతో వ్యవసాయరంగానికి, రైతాంగానికి పూర్తిగా ప్రయోజనం చేకూరనుంది.
10,208 పనులకు అనుమతులు
జూలై ఒకటి నుంచి ప్రారంభం కానున్న వీబీ-జీ-రామ్-జీ పథకానికి సంబంధించి జిల్లాలో 10,208 పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. ఇందుకోసం రూ.158.26 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పటి వరకు 5112 పనులను డ్వామా అధికారులు గ్రౌండింగ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 49,226 పనులను చేపట్టాల్సి ఉండగా, రూ.1029.60 కోట్లు ఖర్చవుతుందని డ్వామా అధికారులు అంచనా వేశారు.
జిల్లాలో ఇదీ కూలీల లెక్క
ఉపాధిలో జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు : 2,22,000
నమోదైన మొత్తం కూలీల సంఖ్య : 3,80,000
ఉపాధి పనులకు వస్తున్న కుటుంబాల సంఖ్య : 1,70,000
ఉపాధి పనులకు వస్తున్న కూలీల సంఖ్య : 2,69,000