Share News

Tirumala: తిరుమలలో ఏఐ స్మార్ట్‌ బస్‌షెల్టర్లు

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:23 AM

తిరుమలలో స్మార్ట్‌ బస్‌షెల్టర్ల ఏర్పాటుకు రేమాండ్స్‌ సంస్థ ముందుకొచ్చింది.

Tirumala: తిరుమలలో ఏఐ స్మార్ట్‌ బస్‌షెల్టర్లు
ఏఐ స్మార్ట్‌ బస్‌షెల్టర్‌ నమూనా చిత్రం

తిరుమల, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుమలలో స్మార్ట్‌ బస్‌షెల్టర్ల ఏర్పాటుకు రేమాండ్స్‌ సంస్థ ముందుకొచ్చింది.తిరుమలలో భక్తులకు టీటీడీ ఉచిత రవాణా అందిస్తున్న విషయం తెలిసిందే. ‘ధర్మరథాల’ పేరుతో తిరుమలలోని వివిధ ప్రాంతాలను భక్తులను చేరవేస్తోంది.గతంలో డీజల్‌ బస్సులుండగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా దశలవారీగా ఈవీ బస్సులను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది.దాతల సహకారంతో ప్రస్తుతం దాదాపు 46 ధర్మరథాలు అందుబాటులో వున్నాయి.అత్యాధునిక బస్సులు అందుబాటులోకి వచ్చినప్పటికీ తిరుమలలోని 21 బస్టా్‌పలు మాత్రం పాతవే ఉన్నాయి.భక్తులు కూర్చోవడానికి కూడా కావాల్సిన సదుపాయాలు లేవు. ఈ క్రమంలో టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వర్షం, చలి, ఎండకు ఇబ్బంది లేకుండా ఈ షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు బస్సుల రాకపోకల సమాచారం తెలిసేలా డిజిటల్‌ డిస్‌ప్లేలు, సీసీ కెమెరాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, అత్యవసర సమయాల్లో వినియోగించుకునే ఎస్‌ఓఎస్‌ బటన్‌ ఏర్పాటు, అత్యవసర లైటింగ్‌, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స సదుపాయాలు వీటిలో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే విద్యుత్‌ అవసరాల కోసం రూఫ్‌టా్‌పపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసి బ్యాటరీ బ్యాకప్‌ సమకూర్చనున్నారు. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రస్తుతమున్న 21బస్‌ షెల్టర్లకు తోడు మరో నాలుగు ప్రాంతాల్లో బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది.ఈ స్మార్ట్‌ బస్‌షెల్టర్లలో ఎలాంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలనే విషయమై టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగం సుధీర్ఘంగా చర్చించి ఓ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఈ క్రమంలో రేమాండ్స్‌ సంస్థ వీటిలో కొన్ని షెల్టర్ల నిర్మాణానికి ముందుకొచ్చింది.


వారంరోజుల క్రితం రేమాండ్స్‌ ప్రతినిధుల బృందం ముంబై నుంచి తిరుమలకు చేరుకుని ప్రస్తుతమున్న బస్‌షెల్టర్లను పరిశీలించింది. అలాగే చెన్నైకి చెందిన మరో దాత కూడా వీటి నిర్మాణానికి ముందుకొచ్చారు. ఈ రెండు సంస్థల ద్వారా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు స్మార్ట్‌ బస్‌షెల్టర్లను నిర్మించనున్నారు. వాటి పనితీరు ఆధారంగా లోటుపాట్లను సవరించి మిగిలిన వాటిని నిర్మించనున్నారు.ఒక్కో స్మార్ట్‌ బస్‌ షెల్టర్‌కు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

Updated Date - Nov 11 , 2026 | 12:23 AM