ACB: కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ హడావుడి
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:57 AM
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్ అసిస్టెంటు మోహన్‌తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది.
గతంలో అవినీతి కేసులో పట్టుబడ్డ నాటి సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్యతోపాటు సాక్షుల విచారణ
కుప్పం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్ అసిస్టెంటు మోహన్‌తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది. ప్రస్తుతం కడపలో ఆడిటర్‌గా పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య 2024లో కుప్పం సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ప్రస్తు తం రిజిస్ట్రార్ డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ కూడా అప్పట్లో ఇక్కడే జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్నారు. 2024 మే 6వ తేదీన కుప్పం సబ్ రిజిస్ట్రార్‌పై ఏసీబీ దాడులు జరిగాయి. భూమి రిజిస్ట్రేషన్‌కోసం వచ్చిన ఒక మహిళనుంచి డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.25 వేలు లంచం తీసుకుం టూ సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్‌బాబు పట్టుబడ్డారు. ‘కుప్పం పట్టణానికి చెందిన వాణి, కుప్పం మండలం కూర్మానిపల్లెకు చెందిన ఎం.రాజు నుంచి 1.60 ఎకరాలను కొనుగోలు చేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం ఈ భూమి విలువ రూ.2.40 లక్షలు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌కోసం సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్‌బాబు రూ.50 వేలు లంచం డిమాండు చేశారు. అంత ఇవ్వలేనని వాణి చెప్పగా, చివరకు రూ.25 వేలు ఇచ్చేలా బేరం కుదిరింది. సబ్ రిజిస్ట్రార్‌తోపాటు, జూనియర్ అసిస్టెంట్ భూమి రిజిస్ట్రేషన్‌కోసం లంచం డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో దాడులు చేశాం’ అని అప్పట్లో ఏసీబీ అధికారులు వివరించారు. ఇదే కేసులో ఇప్పుడు (బుధవారం) ఏసీబీ అధికారులు కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు.
కడపలో ఆడిటర్‌గా పనిచేస్తున్న నాటి సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న నాటి జూనియర్ అసిస్టెంట్ మోహన్, నాడు దళారీగా వ్యవహరించిన రైటర్ షణ్ముగంతోపాటు మరో పదీపన్నెండు మంది సాక్షులను పిలిపించారు. సాయంత్రం వరకు.. ఒకరి తర్వాత ఒకరుగా అందరినీ విచారించారు. ఈ విచారణ వివరాలు చెప్పడానికి ఏసీబీ అధికారులు నిరాకరించారు. పాత కేసులోనే విచారణ సాగడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఏసీబీ హడావుడిపై ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి వివరణ ఇస్తూ 2024లో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ నాటి సబ్ రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య కేసులో ఏసీబీ అధికారులు విచారణకు వచ్చారన్నారు. నాటి కేసులో నిందితులందరినీ తమ కార్యాలయానికి పిలిపించి విచారించారన్నారు.