Academic instructors: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వచ్చేస్తున్నారు!
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:48 AM
ఎప్పటినుంచో ఉపాధ్యాయ లోకం ఎదురు చూస్తున్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వచ్చేస్తున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీల్లో నియామకాలకు అర్హులైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా ఆదివారం మండలాలకు చేరింది. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఎంఈవోలు సోమవారం రెండో విడత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు మంగళవారం (సెప్టెంబరు ఒకటి) నుంచి ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు.
కుప్పం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 450కి పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఆయా పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. వీటిలో 249 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను మాత్రమే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ అర్హతతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం దాకా చిత్తూరులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. అభ్యర్థుల్లో కొంతమంది తగిన అర్హతలు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు. అర్హత కలిగిన అభ్యర్థులతో జిల్లా విద్యాశాఖ జాబితాలను తయారు చేసి మండలాలవారీగా విద్యాశాఖ కార్యాలయాలకు ఆదివారం పంపింది. మంజూరైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకంటే కొన్ని పాఠశాలలో ఒకరిద్దరు ఎక్కువగా అర్హుల పేర్లను కూడా ఈ జాబితాలో పొందుపరిచారు. ఇలా ఎక్కువ మంది ఉంటే ఆయా మండల విద్యాశాఖ కార్యాలయాల్లో సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించి మంజూరైన పోస్టులకు సరిపడిన వారినే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధుల్లోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలను డీఈవో లక్ష్మీనారాయణ విడుదల చేశారు. ఆ ప్రకారం.. ఒకరికంటే ఎక్కువ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో మెరిట్‌లో అత్యధిక స్థానంలో ఉన్న వారినే ఆయా పాఠశాలల్లో నియమించాలి. కొన్ని మండలాల్లో మంజూరైన పోస్టులకు తగినంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోని సందర్భాలూ ఉన్నాయి. అటువంటప్పుడు మండల స్థాయి ఇంటర్వ్యూల ద్వారా ఎంపికై మిగిలిపోయిన అర్హులైన అభ్యర్థులను ఆయా మండలాల్లోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో మంజూరైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల సంఖ్యను మించకుండా కేటాయించాలి. కాగా, కుప్పం నియోజకవర్గంలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు 282 కాగా, మంజూరైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 128 మాత్రమే. ఇంకా 154 ఉపాధ్యాయ ఖాళీలు మిగిలిపోయాయి.
రేపటి నుంచి విధుల్లో చేరిక
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబరు 1న (మంగళవారం) తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలి. ఈ పోస్టుల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీదాకా కొనసాగుతారు. ఆ తర్వాత డీఎస్సీ ఉపాధ్యాయులతో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, జిల్లాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంకోసం జిల్లా విద్యాశాఖ మరో 115 పోస్టులు అదనంగా కావాలని రెండో దఫా ప్రతిపాదనలు పంపింది.