Elephant: హడలెత్తిస్తోన్న మద గజం
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:36 AM
ఆ ఒంటరి ఏనుగు వస్తోందంటే చిన్నగొట్టిగల్లు,ఎర్రావారి పాలెం మండలాల గ్రామీణజనం హడలెత్తుతున్నారు.
ఎర్రావారిపాలెం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆ ఒంటరి ఏనుగు వస్తోందంటే చిన్నగొట్టిగల్లు,ఎర్రావారి పాలెం మండలాల గ్రామీణజనం హడలెత్తుతున్నారు. ఈ రెండు మండలాల్లోని ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా 30 కిలో మీటర్ల మేర పంట పొలాలపై ఒంటరి ఏనుగు దండయాత్ర చేస్తూ అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో చాలామంది రైతులు పంట సాగు చేయడం కూడా మానుకున్నారు. తలకోన అడవుల్లో శాశ్వత స్థావరం ఏర్పర్చుకొన్న 42ఏనుగుల మందలోని ఒక గ్రూప్ ప్రస్తుతం ఎర్రావారిపాలెం మండలం తలకోన , చింతగుంట ద్వారా చిన్పగొట్టిగల్లు మండలం, చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మీదుగా సదుం ,సోమల వైపు 15 రోజుల క్రితం వెళ్ళాయి.కానీ మందనుంచీ దూరంగా ఉండే ఒక మదగజం మాత్రం ఇక్కడే ఆగిపోయింది. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచెర్ల పంచాయతీ తుమ్మసేను పల్లెలో ఆదివారం వేకువజూమున కృష్ణారెడ్డి ఇంటి ముందున్న పశువుల పాక షెడ్ రేకులను తొలగించి పశువుల దాణా మూటను ఆరగించింది.ఆదివారం సాయంత్రం 7గంటలకు దేవరకొండ గ్రామం మైలావాండ్ల పల్లె వద్దకు చేరింది.బడగనపల్లె కృష్ణయ్య వేరుశనగ కాయలు వలిచి కుప్పపోసి పట్ట కప్పి ఉంచగా వేరుశనగ కాయలను తిన్న ఏనుగు పట్టను చించివేసింది. ఊళ్లోవాళ్లంతా చేరి బిగ్గరగా అరవడంతో ఎర్రావారిపాలెం మండలం పచార్లవాండ్ల పల్లె వైపు వెళ్ళింది.ఒంటరి ఏనుగును ఇకనైనా అధికారులు కట్టడి చేసి పంట పొలాలను రక్షించాలని రైతులు కోరుతున్నారు.