Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:52 AM
భారతీయ వారసత్వం - సంస్కృతి అంశంపై పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ విభాగం వారం రోజుల బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తోంది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భారతీయ వారసత్వం - సంస్కృతి అంశంపై పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ విభాగం వారం రోజుల బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని వీసీ వెన్నం ఉమ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలు, భాషలు, పండుగలు, యోగా, సంగీతం, నృత్యం, వంటకాలు, ఆలయ వాస్తుశిల్పం, కళాకృతులు వంటి అంశాలను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. ప్రసంగాలు, ప్రదర్శనలతో పాటు క్షేత్ర పర్యటనలను కూడా ఇందులో భాగం చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రార్ ఉష మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలతో మన దేశ సంస్కృతి విశ్వవ్యాప్తమవుతుందన్నారు. ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు వివరించారు. మలేషియా ప్రతినిధి డాక్టర్ మన్నూర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ పద్మావతి యూనివర్సిటీతో గతంలో చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు చెప్పారు.మలేషియా, బంగ్లాదేశ్, తైవాన్ తదితర దేశాల ప్రతినిధులతో పాటు పద్మావతి వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ దుర్గాభవాని, అధ్యాపకులు అమృతవల్లి, శైలేశ్వరి, జ్యోత్స్న, శోభ, సుభాషిణి, శివపార్వతి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.