Share News

Yoga: ఆసనాలు వేసిన 3.2 లక్షల మంది

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:50 AM

విల్లులా వంగారు. తమ శరీరాన్ని స్ర్పింగులా వంచారు. ఎటు పడితే అటు అలవోకగా వంగుతూ.. అబ్బుర పరిచేలా యోగా విన్యాసాలను ప్రదర్శించారు. ఇలా చిత్తూరులోని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆహూతులను విద్యార్థులు అలరించారు.

Yoga: ఆసనాలు వేసిన 3.2 లక్షల మంది
యోగాసనాలు

చిత్తూరు క్రీడలు, ఆంధ్రజ్యోతి: జిల్లా అంతటా యోగామయంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం 3.2 లక్షల మంది ఆసనాలు వేశారు. ఉదయం 6.30 నుంచి 7.45 గంటల వరకు 9 వేలకుపైగా వేదికలపై యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిత్తూరులోని పీవీకేఎన్‌ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, నేతలు, స్థానికులు కలిసి వెయ్యి మందికిపైగా ఆసనాలు వేశారు. యోగాను కేవలం ఒక్క రోజు కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జేసీ ఆదర్శ రాజేంద్రన్‌ పిలుపునిచ్చారు. జిల్లాలో రెండు వారాలుగా నిర్వహించిన యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కలిగిందన్నారు. యోగాంధ్రను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, యోగా గురువులు, విద్యాసంస్థలు, క్రీడా, ఆయుష్‌ శాఖకు అభినందనలు తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి రోజూ యోగాకు కొంత సమయం కేటాయించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ సూచించారు. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆరోగ్య రహస్యం కూడా యోగా చేయడమేనని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ అన్నారు. అనంతరం యోగాలో ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. డీఆర్వో మోహన్‌కుమార్‌, ఆర్డీవో శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్‌ హేమలత, యోగా గురువులు బాబు నాయుడు, శ్రీనివాసులు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆరోగ్యంగా జీవిద్దాం: కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఒక్కటే మార్గమని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, యోగా ఆవశ్యకతను విశ్వవ్యాప్తంగా చేసేలా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థి దశనుంచే యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. రెండు వారాలుగా జేసీ గోవిందరావు ఆధ్వర్యంలో షార్‌, శ్రీకాళహస్తీశ్వరాలయం, చంద్రగిరి కోట, ఎస్వీ జూపార్కు వంటి ప్రదేశాల్లో ‘యోగాంధ్ర’ నిర్వహించి పర్యాటకాన్ని ప్రోత్సహించినట్లు తెలిపారు.


క్రమశిక్షణ గల సమాజం ఏర్పడుతుంది: ఎస్పీ

యోగాతో క్రమశిక్షణ గల సమాజం ఏర్పడుతుందని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్ట్‌ ఆఫ్‌ లింగ్‌ యోగా గురువు క్రాంతి ఆధ్వర్యంలో గంట పాటు యోగసనాల కార్యక్రమం జరిగింది. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ వీసీలు నరసింహారావు, ఉమ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, డీఆర్వో నరసింహులు, గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్‌పర్సన్‌ సుగణమ్మ, హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, ఆర్డీవో రామ్మోహన్‌, ఏఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాసరావు, తుడా కార్యదర్శి శ్రీకాంత్‌, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, పర్యాటక ఆర్డీ రమణప్రసాద్‌, జిల్లా పర్యాటక అధికారి జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లోనూ, టీటీడీ ఆధ్వర్యంలోనూ యోగాంధ్ర కార్యక్రమం జరిగింది.

Updated Date - Jun 22 , 2026 | 01:50 AM